బంగారం నెక్ట్స్‌ టార్గెట్‌ ఇదేనా..?

14 Apr, 2020 18:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్ధితులతో పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. భారత్‌లో కరోనా కేసులు పెరగడం, లాక్‌డౌన్‌ పొడిగింపు వార్తలతో సోమవారం ఒక్కరోజే ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 1000 భారమై ఏకంగా రూ 46,255కు ఎగబాకింది. బంగారం ధరలు ఇదే ధోరణిలో కొనసాగుతూ ఏడాది చివరికి రూ 50,000 నుంచి రూ 55,000కు చేరుతాయని పీఎన్‌జీ జ్యూవెలర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సౌరవ్‌ గాడ్గిల్‌ ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ అంచనా వేశారు. 2019లో 23.74 శాతం పెరిగిన ధరలు ఈ ఏడాది సైతం భారీ రిటన్స్‌ అందిస్తాయని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు.

వైరస్‌ భయాలు, స్పెక్యులేషన్‌, ప్రస్తుత ఆర్థిక పరిస్ధితులపై అనిశ్చితితో రాబోయే రెండు మూడేళ్లు బంగారం ధరలు పైపైకే ఎగబాకుతాయని అంచనా వేస్తున్నారు. యుద్ధాలు, ఇతర సంక్షోభ సమయాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు సానుకూలంగా ఉంటారని గాడ్గిల్‌ పేర్కొన్నారు. 2020లో బంగారం పదిగ్రాములకు ఇప్పటికే రూ 6794 (17.31 శాతం) చొప్పున పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో సురక్షిత పెట్టుబడిగా మదుపుదారులు పసిడివైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. కరెన్సీలు, మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతుండటంతో  రానున్న రోజుల్లో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటాయని ఇది బంగారానికి మరింత డిమాండ్‌ పెంచుతుందని గాడ్గిల్‌ అన్నారు.

చదవండి : బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది

ప్రస్తుతం అమెరికా తర్వాత చైనా, రష్యా జర్మనీ వద్ద అత్యధికంగా బంగారం నిల్వలున్నాయని, ఐరోపా యూనియన్‌, ఐఎంఎఫ్‌ వద్దా పసిడి నిల్వలున్నాయని, రాబోయే రోజుల్లో భారత్‌ సహా పలు దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకుంటాయని ఆయన అంచనా వేశారు. బంగారాన్ని దశలవారీగా కొనుగోలు చేసుకుంటూ వెళితే రాబోయే రెండు మూడేళ్లలో మెరుగైన రిటన్స్‌ లభించే అవకాశం ఉందని అన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా