పసిడి దూకుడుకు విరామం..!

16 May, 2016 06:42 IST|Sakshi
పసిడి దూకుడుకు విరామం..!

పెట్టుబడులకు ఇన్వెస్టర్ల వేచిచూసే ధోరణి...
న్యూఢిల్లీ: పసిడికి సంబంధించి ఇన్వెస్టర్లు సమీప కాలంలో వేచిచూసే ధోరణిని అవలంభించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధర స్వల్పకాలికంగా అధిక దూకుడు ప్రదర్శించకపోవచ్చన్నది వారి అంచనా. అమెరికా ఫెడరల్ బ్యాంక్  ఫండ్ రేటు నిర్ణయం, ఆర్థికాభివృద్ధి అవకాశాలు, క్రూడ్ ఆయిల్ ధరలు వంటి పలు స్థూల అంశాల ప్రాతిపదికన మున్ముందు ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆయా అంశాలే పసిడి సమీప కదలికలను నిర్దేశిస్తాయని వారి అంచనా. శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ (31.1గ్రా) ధర వారం వారీగా స్వల్పంగా 0.76 శాతం ఎగిసి, 1,272 డాలర్ల వద్ద ముగిసింది. రెండు వారాల క్రితం ఔన్స్ ధర 1,300 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే.
 
దేశీయంగానూ మందగమనం...
అధిక ధరల నేపథ్యంలో దేశంలోనూ పసిడి కొనుగోళ్లు మందగమనంలో ఉన్నాయి. అక్షయతృతీయనాడు ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకూ వారం వారీగా  రూ.60 తగ్గి రూ.30,030 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర 10 గ్రాములకు ఈ రేటు అంతే స్థాయిలో తగ్గి రూ.29,880 వద్ద ముగిసింది.  కాగా పరిశ్రమల నుంచి డిమాండ్ నేపథ్యంలో వెండి కేజీ ధర రూ.420 ఎగిసి రూ.40,995 వద్ద ముగిసింది. వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తక్కువగా ఉందని బులియన్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. అయితే అంతర్జాతీయంగా ధరల ట్రెండ్ పటిష్టంగా ఉండడం వల్ల... ఇదే ధోరణి దేశీయంగానూ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు