బలహీనంగానే పసిడి..

20 Aug, 2018 00:48 IST|Sakshi

టర్కీ సంక్షోభం, అమెరికా–చైనాల చర్చలు కీలకం  

ముంబై: వర్ధమాన దేశాల కరెన్సీలు కుప్పకూలి.. డాలర్‌ ర్యాలీ చేయడంతో పసిడి రేట్లు గత వారంలో అంతర్జాతీయంగా క్షీణించాయి. అమెరికాలోని కమోడిటీ ఎక్సే్చంజ్‌లో డిసెంబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 35.90 డాలర్ల మేర క్షీణించి 1,183.10 డాలర్లకు పడిపోయింది.  ఒక దశలో 1,167.10 డాలర్లకు కూడా పతనమైనప్పటికీ.. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గొచ్చన్న ఆశావహ అంచనాలతో కాస్త కోలుకుంది. టర్కీ లీరా పతన సంక్షోభం కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తున్నా .. పసిడిలో అమ్మకాల వెల్లువకు అడ్డుకట్ట పడేట్లు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాస్టర్‌ ఆండ్రూ బ్రూన్‌సన్‌ను అప్పగించకపోతే టర్కీపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించిన పక్షంలో సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని, ఫలితంగా పసిడిపై కొత్తగా అమ్మకాల ఒత్తిడి మరింత పెరగవచ్చని వారు తెలిపారు.

వాణిజ్య యుద్ధాల మీద అమెరికా, చైనా చర్చలు జరపొచ్చన్న ఆశావహ అంచనాలతో బంగారం రేటు కాస్త స్థిరంగా ఉన్నా.. ఈ చర్చల ఫలితాలపైనే ధరల కదలిక ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ చర్చల్లో ఎలాంటి పురోగతి గానీ లేకపోతే.. ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోను కావొచ్చని.. ఫలితంగా బంగారంలో అమ్మకాలు మరింతగా పెరగొచ్చని పరిశ్రమవర్గాల విశ్లేషణ. అలాగే, అమెరికాలో అంతర్జాతీయ సెంట్రల్‌ బ్యాంకర్ల సదస్సులో తీసుకునే నిర్ణయాలు కూడా బంగారాన్ని ప్రభావితం చేస్తాయన్నది వారి అభిప్రాయం.  

దేశీయంగా డౌన్‌.. 
అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన ట్రెండ్స్‌కి తగ్గట్లు దేశీయంగా కూడా బంగారం ధరలు క్షీణించాయి. స్పాట్‌ మార్కెట్లో స్థానిక జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి సైతం డిమాండ్‌ పెద్దగా లేకపోవడం కూడా పసిడి రేటు తగ్గడానికి కారణమైందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.  న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో గత వారాంతానికి మేలిమి బంగారం ((99.9% స్వచ్ఛత) పది గ్రాముల రేటు రూ.450 మేర తగ్గి రూ. 30,250 దగ్గర ముగిసింది. అలాగే ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) కూడా అంతే క్షీణతతో రూ. 30,100 వద్ద క్లోజయ్యింది.

>
మరిన్ని వార్తలు