పసిడి ర్యాలీకి బ్రేకులు?

25 Feb, 2019 00:42 IST|Sakshi

వాణిజ్య చర్చలు, ఫెడ్‌ ధోరణి కీలకం 

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య సంధి కుదిరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పసిడి ర్యాలీకి కాస్త బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాల పరిష్కార చర్చల్లో గణనీయంగా పురోగతి ఉందని, త్వరలో ఒక ఒప్పందం కుదరవచ్చని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, అటు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ప్రకటించడంతో ఈక్విటీలు ర్యాలీ చేయడం, పసిడి జోరు కొంత తగ్గడం ఈ అంచనాలకు ఊతంగా నిలుస్తున్నాయి. ఇక, ఈ వారంలో ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అమెరికా హౌస్‌ కమిటీకి వడ్డీ రేట్ల తీరుతెన్నుల గురించి వివరించనుండటం కూడా బంగారం రేట్లపై ప్రభావం చూపవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇచ్చిన ఫెడ్‌.. అంతర్జాతీయ వృద్ధికి రిస్కులు తగ్గుతున్న నేపథ్యంలో ధోరణి మార్చుకోవచ్చని అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ వారం వాణిజ్య యుద్ధ భయాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ ధోరణి బంగారం ధరలకు దిశా నిర్దేశం చేయనున్నాయి. గత వారం అంతర్జాతీయంగా
పసిడి రేటు ఔన్సుకు (31.1 గ్రాములు) పది నెలల గరిష్టం 1,341 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గింది.  

మరోవైపు, దేశీయంగా గతవారం పసిడి రేట్ల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో స్థానిక జ్యుయలర్ల కొనుగోళ్ల ఊతంతో న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో మరో రూ. 140 పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ఇందుకు కొంత దోహదపడింది. వారాంతంలో మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 34,830 వద్ద, ఆభరణాల బంగారం రేటు రూ. 34,680 వద్ద ముగిశాయి. వెండి కిలో ధర రూ. 250 పెరిగి రూ. 41,500 వద్ద క్లోజయ్యింది. 

>
మరిన్ని వార్తలు