కొనసాగుతున్న పసిడి పరుగు

21 Aug, 2019 04:55 IST|Sakshi

జీవితకాల గరిష్టస్థాయికి ధర

ఢిల్లీలో 10గ్రా. ధర రూ.38,770

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల

న్యూఢిల్లీ: దేశీంగా బంగారం ధర జోరుమీద కొనసాగుతోంది. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ.. తాజాగా మరో రికార్డు స్థాయిని నమోదుచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్‌ గోల్డ్‌) బంగారం ధర రూ.38,770 చేరుకుంది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ క్రమంగా పెరిగిన కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.200 పెరిగి ఆల్‌ టైం రికార్డు హైకి చేరిందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనమవుతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఒక దశలో 1,496.60 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్‌ హోల్‌ ఎకనామిక్‌ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌  ప్రసంగం, ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్‌ వెల్లడి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ కమోడిటీ విభాగం హెడ్‌ హరీష్‌ అన్నారు.

శాంతించిన వెండి..
దేశ రాజధానిలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఇండస్ట్రీ, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గిన కారణంగా స్పాట్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.43,900 చేరుకుంది.

బంగారు నగలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి!
     అందరితో చర్చించి నిర్ణయం
బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి

కోల్‌కతా: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న తన ప్రతిపాదనను కేంద్రం మళ్లీ వెలుగులోకి తెచ్చింది.  ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)నోటిఫై చేయడం కోసం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను  జారీ చేస్తామని బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ సురైనా రాజన్‌ పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న ముఖ్యంగా పుత్తడి వర్తకులతో సంప్రదింపులు అనంతరమే ఈ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుందని ఆమె వివరించారు.  

గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి డిజిటైజేషన్‌ కార్యక్రమాన్ని ఐఐటీ–ముంబై అమలు చేస్తోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా హాల్‌మార్కింగ్‌ సెంటర్లను బీఐఎస్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తామని, పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్ధమైన తర్వాతనే హాల్‌మార్కింగ్‌ కోడ్‌ జనరేట్‌ అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 800 హాల్‌మార్కింగ్‌ సెంటర్లు ఉన్నాయని, మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి మాత్రమే హాల్‌మార్కింగ్‌ ఉందని తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా