రూ.48000 దిగువకు బంగారం

23 Jun, 2020 10:19 IST|Sakshi

రికార్డు స్థాయి వద్ద లాభాల స్వీకరణ

బంగారానికి డిమాండ్‌ తగ్గించిన ఈక్విటీల ర్యాలీ

నిన్నటిరోజు రికార్డు స్థాయికి ఎగిసిన బంగారం ధరలో మంగవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బంగారం ధర రూ.48వేల స్థాయి దిగువకు చేరుకుంది. ఎంసీఎక్స్‌లో నేటి ఉదయం సెషన్‌లో స్వల్పంగా రూ.50 నష్టపోయి రూ.47906 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా బంగారం డిమాండ్‌ను తగ్గించాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా నిన్నటి రోజు బంగారం ధర ఒక దశలో రూ.352 లాభపడి రూ.48,289 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి రూ.7 స్వల్ప లాభంతో రూ.47,944 వద్ద స్థిరపడింది.

‘‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరిగినపుడు, ఈక్విటీ మార్కెట్లో  అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడు,  అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బంగారంలో పెట్టుబడులను రక్షణాత్మక వ్యూహంగా ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కరోనా కేసులు అదుపులోకి రావాలి. కోవిడ్‌-19 వైరస్‌కు సరైన వ్యాక్సిన్‌ కనుక్కోవాలి. అంతవరకు బంగారం ర్యాలీ కొనసాగుతుంది.’’ అని ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సాల్టింగ్‌ అధిపతి నిషా భట్‌ తెలిపారు. 

అంతర్జాతీయంగా 6డాలర్ల పతనం: క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో బంగారం ధర 10వారాల గరిష్టాన్ని అందుకున్న నేపథ్యంలో నేడు బంగారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. నేడు ఆసియా  ఈక్విటీ మార్కెట్లు లాభపడ్డాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభంతో ముగిశాయి. ఈ కారణాలతో బంగారం ధర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటుంది. కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 9మిలియన్లను దాటడంతో పాటు అమెరికా, చైనాల దేశాల్లో రెండో దశ వ్యాధి వ్యాప్తితో నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర 10-వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు