పసిడి ఫ్యూచర్లు: 2రోజూ నేలచూపులే..!

15 Jun, 2020 13:00 IST|Sakshi

దేశీయంగా రూ.47వేల దిగువకు ...

అంతర్జాతీయ మార్కెట్లో 10డాలర్ల పతనం

దేశీయ బులియన్‌ మార్కెట్లో  పసిడి ఫ్యూచర్ల ధర వరుసగా 2రోజూ నేలచూపులు చూస్తోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం ఆగస్ట్‌ కాంటాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.360 నష్టపోయి రూ.46,974 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర 2శాతం లాభపడి రూ.47,334 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పరిస్థితుల్లో ‘‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’’ వ్యూహాన్ని అమలు చేసుకోవచ్చని బులియన్‌ పండితులు  చెబుతున్నారు. పసిడి ఫ్యూచర్ల ధర రూ.47,550లను అధిగమించగలిగితే రూ.47,800-48,000 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారు. ఈ 2020 ఇప్పటి వరకు పసిడి 20శాతం ర్యాలీ చేయగా,  గతేడాది కాలంగా 25శాతం లాభపడింది. 

అంతర్జాతీయ మార్కెట్లో 10డాలర్ల పతనం: 
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఏకంగా 10డాలర్లు నష్టాన్ని చవిచూసింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల క్షీణించి 1,737.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాధి రెండో దశ వ్యాప్తి భయాలతో రక్షణాత్మక సాధనమైన పసిడికి ప్యూచర్లకు డిమాండ్‌ పెరగడంతో గతవారంలో 2.5శాతం లాభపడి 1737 డాలర్ల వద్ద స్థిరపడింది. 

‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన పరిస్థితుల్లో ఉంది. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాధి రెండో దశ వ్యాప్తి మొదలైంది. పలు సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. ఈ పరిస్థితులన్నీ పసిడికి కలిసొచ్చేవే. పసిడి తిరిగి ర్యాలీ అని అందుకుంటుంది.’’ అని యాక్సికార్ప్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఛీఫ్‌ మార్కెట్‌ వ్యూహకర్త స్టీఫెన్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు