రూ.49 వేల దిగువ‌కు బంగారం!

14 Jul, 2020 10:54 IST|Sakshi

అంతర్జాతీయంగానూ 1800డాలర్ల కిందకు

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో మంగళవారం బంగారం ధర రూ.49వేల దిగువకు చేరుకుంది. ఎంసీఎక్స్‌లో ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.200 నష్టంతో రూ.48948 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1800డాలర్ల స్థాయిని కోల్పోడంతో దేశీయంగా బంగారం ధర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. నిన్నరాత్రి రూ.285లు లాభపడి రూ.49,148 వద్ద ముగిసింది. 

బంగారం ధర ఎంసీఎక్స్‌లో రూ.48,900-48,750 పరిధిలో కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రోజురోజూకూ పెరుగుతున్న కరోనా కేసులు, ఆయా దేశాల మధ్య చెలరేగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో బంగారానికి మరింత డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. కాబట్టి బంగారం దిగివచ్చిన ప్రతిసారి కొనుగోలు చేయడం మంచిదని బులియన్‌ నిపుణులు చెబుతున్నారు.  

అంతర్జాతీయంగా 1800డాలర్ల దిగువకు: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మంగళవారం 1800డాలర్ల దిగువకు చేరకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలపడటంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. అలాగే ఇటీవల గరిష్టాన్ని తాకిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పూనుకోవడం కూడా బంగార ధర దిగివచ్చేందకు కారణమైంది. ఆసియాలో మార్కెట్లో ఉదయం సెషన్‌లో నిన్నరాత్రి ముగింపు(1,814డాలర్లు)తో పోలిస్తే 15డాలర్లు నష్టాన్ని చవిచూసి 1799 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు