స్థిరంగా బంగారం ధర

30 Jun, 2020 10:37 IST|Sakshi

అంతర్జాతీయంగానూ ఫ్లాట్‌ ట్రేడింగ్

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర వరుసగా రెండోరోజూ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.56 పెరిగి రూ.48,300 ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారం పరిమిత శ్రేణిలో కదలాడటంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం లాంటి అంశాలతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి ఆందోళనలు, అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌ బలహీనంగా ఉన్నంత వరకు బంగారం ర్యాలీకి ఏ ఢోకా లేదని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో తెలిపింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి బంగారం రూ.61ల స్వల్ప నష్టంతో రూ.48244 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నేటితో ముగియున్న కార్వర్ట్‌లో బంగారం ధర 12శాతం లాభపడింది. ఆర్థిక, రాజకీయ, భౌగోళిక సంక్షోభాల సమయాల్లో బంగారంలో పెట్టుబడులను రక్షణాత్మక చర్యగా భావిస్తారు. 

అంతర్జాతీయంగానూ ఫ్లాట్‌ ట్రేడింగ్‌: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఫ్లాట్‌ ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ఉదయం సెషన్‌లో 10గ్రాముల బంగారం ధర సోమవారం(రూ.1,781)తో పోలిస్తే 2డాలర్ల స్వల్ప లాభంతో 1,783 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌ జెరోమ్ పావెల్‌తో పాటు ఆర్థికమంత్రి స్టీవెన్ మునుచిన్‌ ఆర్థికవ్యవస్థ అవుట్‌లుక్‌, ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తదుపరి చర్యలపై నేడు హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ప్రసగించనున్నారు. ఈ నేపథ్యంలో బులియన్‌ ట్రేడర్లు అప్రమత్తత వహిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో  సోమవారం ఈక్విటీ మార్కెట్లు లాభపడ్డాయి. ఫలితంగా బంగారం ధర ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలు హరించుకుపోయి ఒక డాలరు స్వల్ప లాభంతో 1,781 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు