బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది

2 Mar, 2020 14:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు ఎంతైనా బంగారం బంగారమే అన్న రేంజ్‌లో తిరిగి పుంజుకున్నాయి. నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టిన ధరలు సోమవారం  మళ్లీ ర్యాలీ అయ్యాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.593  పెరిగి 10 గ్రాముల పసిడి రూ.41,829 వద్ద ట్రేడ్‌ అయింది.  మునుపటి సెషన్‌లో భారీగా పడిపోయిన తరువాత బంగారం ధరలు  ఫ్యూచర్‌ మార్కెట్లో1.42 శాతం ఎగిసాయి. కిలో వెండి ధర రూ. 45350 వద్ద కొనసాగుతోంది. 

అటు ప్రపంచ మార్కెట్లలో, మునుపటి సెషన్లో 5 శాతం నష్టపోయిన పసిడి ఈరోజు లాభాల్లో వుంది. కరోనా వైరస్‌ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి 1.3 శాతం పెరిగి  ఔన్సు ధర  16.88 డాలర్లకు చేరింది. ఇతర విలువైన లోహాలలో పల్లాడియం  ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 2,611 డాలర్లు,  ప్లాటినం 1.9 శాతం  880 డాలర్లకు చేరుకుంది. మరోవైపు  శుక్రవారం 1500 పాయింట్లకు పైగా కుప్పకూలిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా రికవరీ సాధించాయి.  ఆరంభంలోనే దాదాపు 750 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 587  పాయింట్ల లాబంతో 39 వేల మార్క్‌కు దిగువన, నిఫ్టీ 164 పాయింట్ల లాభంతో 11365 వద్ద 11500 స్థాయికి దిగువన కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్‌-19 ఆందోళన, ఆర్థిక మందగమనంపై  శుక్రవారం ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా వుందని, అవసరమైతే అన్ని చర్యల్ని తీసుకోవడానికి తాము (ఫెడ్‌) సిద్ధంగా ఉందంటూ వడ్డీరేట్ల  కోత సంకేతాలందించారు. ఈ  నేపథ్యంలో  ఫెడరల్ రిజర్వ్ రేట్లు భారీగా తగ్గించనుందని గోల్డ్మన్ సాచ్స్‌ ఆర్థికవేత్తలు ఆదివారం అంచనా వేశారు. అలాగే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 1,800 డాలర్లకు చేరుతుందని పేర్కొంది. 


 

మరిన్ని వార్తలు