మరోసారి రూ.49వేల పైకి బంగారం

13 Jul, 2020 10:45 IST|Sakshi

అంతర్జాతీయంగా 6డాలర్లు జంప్‌

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర సోమవారం తిరిగి రూ.49వేల స్థాయిని అందుకుంది. ఎంసీఎక్స్‌లో ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.49013 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, అమెరికా-చైనాల మధ్య మరోసారి తెరపైకి వచ్చిన వాణిజ్య ఉద్రిక్తతలు బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. సాదారణంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభ సమయాల్లో బంగారం కొనుగోలును ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనంగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో ఫేజ్‌-2 వాణిజ్య ఒప్పంద చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఇక కరోనా కేసుల విషయానికొస్తే.., ప్రపంచవ్యాప్తంగా 13.03కోట్ల మందికి ఈ వ్యాధి సోకగా, భారత్‌తో 8.78లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతవారంలో బంగారం ధర రూ.49,348 వద్ద కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

అంతర్జాతీయంగా 6డాలర్లు జంప్‌‌:-
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 5డాలర్లు లాభపడింది. నేటి ఉదయం సెషన్‌లో ఆసియాలో ఔన్స్‌ బంగారం ధర 6డాలర్ల లాభంతో 1807డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం అమెరికాలో ఔన్స్‌ బంగారం ధర రూ.1801 డాలర్ల వద్ద ముగిసింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్‌ బలహీనత తదితర కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1800 డాలర్ల వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుందని బులియన్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు