రూ.48,000కు దిగివచ్చిన బంగారం

6 Jul, 2020 10:19 IST|Sakshi

రికార్డు స్థాయి నుంచి రూ.1000 పతనం

అంతర్జాతీయంగానూ 10డాలర్ల క్షీణత

మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర సోమవారం రూ.48వేల దిగువకు చేరుకుంది. ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం రూ.271లు నష్టపోయి రూ. 47,775 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారానికిది వరుసగా 4రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఆర్థిక వృద్ధి రికవరీతో ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో పాటు రికార్డు స్థాయిలో బంగారం ధరలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర కారణాలు బంగారం దిగివచ్చేందుకు కారణమయ్యాయి.  గతవారంలో బుధవారం(జూన్‌ 1న) రూ.48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకున్న నాటి నుంచి దాదాపు రూ.1000లు నష్టాన్ని చవిచూసింది.  

అయితే బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ పండితులు విశ్వసిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదల భయాలు, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, గరిష్టస్థాయిల వద్ద ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ తదితర అంశాలు రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్‌ను పెంచవచ్చని వారు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో రూ.47,500-47,600 శ్రేణిలో బంగారానికి కీలక మద్దతు లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లో 10డాలర్ల పతనం: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నష్టాన్ని చవిచూసింది. ఆసియాలో నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ బంగారం ధర 10డాలర్ల క్షీణించి 1,780డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అధిక లిక్విడిటీ లభ్యత, సెంట్రల్‌ బ్యాంకుల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనల నేపథ్యంలో ఆర్థిక రికవరీపై ఆశలతో నేడు ఆసియా మార్కెట్లు 4నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు