పసిడి పరుగో.. పరుగు! రూ.1200 జంప్‌

4 Mar, 2020 08:55 IST|Sakshi

అంతర్జాతీయంగా 50 డాలర్లకుపైగా పెరుగుదల

దేశంలోనూ  పరుగు! ‍ రూ.1200 జంప్‌

సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనం, కరోనా కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి మీమాంస తగదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారంనాటి విమర్శలు,  దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు  నిర్ణయంంతో పసిడి మళ్లీ భారీగా దూసుకెళ్లింది. ఈ వార్త రాసే  సమయంలో(మంగళవారం రాత్రి 0.30కు) అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర 50 డాలర్ల పెరుగుదలతో 1,644 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిజానికి వారం క్రితం ఏడేళ్ల గరిష్టం 1,691 డాలర్లకు చేరిన పసిడి గత వారం ముగిసేనాటికి 1,565 డాలర్ల వరకూ పడిపోయింది. 

రూపాయి...గరిష్టానికి 100 పైసలు దూరంలో.. 
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత పసిడికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి జారింది.  2018 అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  తాజా రూపాయి బలహీనత కూడా తోడు కావడంలో ఈ వార్త రాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత  ధర సోమవారం ముగింపుతో పోల్చితే (రాత్రి 10.30 గంటల సమయంలో) రూ.1,289 లాభంతో రూ.43,245 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే బుధవారం పలు పట్టణాల్లోని స్పాట్‌ మార్కెట్లలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర రూ.44,000 దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు