వారంలో 30 డాలర్లు కిందకు..!

11 Dec, 2017 01:57 IST|Sakshi

అమెరికా పన్ను సంస్కరణలపై సానుకూల అంచనాలు

వ్యవసాయేతర ఉపాధి అవకాశాల మెరుగుదల

డాలర్‌ బలోపేతం, బిట్‌ కాయిన్‌ పరుగులూ నేపథ్యం

సమీప రోజుల్లో సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాల ప్రభావం!

అంతర్జాతీయ న్యూయార్క్‌ కమోడిటీ  ఎక్స్చేంజి  నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 8వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో భారీగా 30 డాలర్లు పడిపోయింది. వారాంతపు ట్రేడింగ్‌ రోజు (శుక్రవారం) ఒక దశలో కీలకమైన మద్దతు 1,250 డాలర్ల దిగువకు పడిపోయి, 1,246 డాలర్ల స్థాయిని తాకి చివరకు మళ్లీ 1,250 డాలర్ల పైస్థాయిలో ముగిసింది. జూలై తరువాత పసిడి ఒకేవారంలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. 1,250 డాలర్ల స్థాయి దిగువన ముగిస్తే, ధర తప్పనిసరిగా దిగువ స్థాయిలో 1,220 డాలర్లను చూస్తుందన్న అంచనాలున్నాయి.  రెండు నెలలుగా 1,300 డాలర్లను అధిగమించలేకపోయిన నేపథ్యంలో దిగువవైపుగా ధర కొంత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా.

తక్షణం ప్రభావం చూపిన అంశాలివీ...
అమెరికా పన్ను సంస్కరణలపై సానుకూల అంచనాలు పసిడిలో లాభాల స్వీకరణకు ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
 ఇక నవంబర్‌లో అమెరికా వ్యవసాయేతేర ఉపాధి కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా వచ్చాయి. ఆయా సానుకూల అంశాల నేపథ్యంలో వారం క్రితం 93 స్థాయిలో ఉన్న డాలర్‌ ఇండెక్స్‌ గురువారమే 94 స్థాయిని దాటింది. వారాంతం ముగింపు 93.84.
 పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీ మార్కెట్లకు లాభాలు, క్రిప్టో కరెన్సీ– బిట్‌ కాయిన్‌ రికార్డు పరుగుల వంటి అంశాలూ ఇక్కడ ప్రస్తావనాంశం.
 మరోవైపు  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) సమావేశాలు వచ్చే వారం జరగనుండడం, ఆయా నిర్ణయాల ప్రభావం పసిడిపై ఉంటుందన్న విశ్లేషణలున్నాయి. వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్‌ నిర్ణయం తీసుకున్నా, ఈసీబీ కఠిన ద్రవ్య విధానం అవలంబించినా అది పసిడి మరింత పతనానికి దారితీసే వీలుందని విశ్లేషకుల అభిప్రాయం.
 అయితే 1,200 డాలర్ల స్థాయికి పసిడి పడిపోతే, అది కొనుగోళ్లకు మంచి అవకాశం అన్న అంచనా కూడా ఉంది.


దేశీయంగా 3 వారాల్లో రూ.1,000 డౌన్‌!
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా కనబడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి ధర వరుసగా మూడవ వారమూ తగ్గింది. 8వ తేదీతో ముగిసిన వారంలో రూ.666 తగ్గి రూ.28,533కు చేరింది.

ఇక ముంబై స్పాట్‌ మార్కెట్లో  వారం వారీగా ధర రూ 755 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.755 తగ్గి రూ. 28,645 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.28,495కి పడింది. మొత్తంగా మూడు వారాల్లో దేశంలో పసిడి 10 గ్రాముల ధర దాదాపు రూ. 1,000 తగ్గింది. ఇక వెండి ధర కేజీకి  రూ.1,450 పడిపోయి రూ. 36,620 వద్ద ముగిసింది. ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వారంలో మరో ఐదు పైసలు బలపడి 64.45కు చేరింది. రూపాయి బలంగా లేకపోతే, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా బంగారం మరింత పడేది. 

మరిన్ని వార్తలు