డాలర్‌ ఎఫెక్ట్‌ : వన్నె తగ్గిన పసిడి

21 Jun, 2018 13:12 IST|Sakshi

సాక్షి, ముంబై: పసిడి, వెండి ధరలు బలహీనపడ్డాయి. వివిధ కరెన్సీలతో పోలిస్తే..డాలరు 11నెలల గరిష్టానికి చేరడం, తదితర కారణాలతో అంతర్జాతీయంగా,  దేశీయంగా పుత్తడి  వెనుకంజలో ఉంది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలపడుతున్న కారణంగా బంగారం ధర దిగి వస్తోందని బులియన్‌ ట్రేడర్ల విశ్లేషణ. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తాజాగా ఆరు నెలల కనిష్టానికి చేరింది. ఇటు దేశీయంగానే ఇదే ధోరణి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్షీణించడంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఎంసీఎక్స్‌లో  గోల్డ్‌ ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాములు రూ. 131  నష్టపోయి రూ. 30,650 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ  రూ.136 నష్టంతో రూ. 39,490కు చేరింది.

అంతర్జాతీయంగా ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 10 డాలర్లు(0.8 శాతం) క్షీణించింది. ఆగస్ట్‌ డెలివరీ 1264 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ ధర అయితే 0.4 శాతం వెనకడుగుతో 1263 డాలర్లకు చేరింది. ఇక వెండి సైతం 0.6 శాతం నీరసించి 16.21 డాలర్లను తాకింది. 2017డిసెంబర్‌ నాటి స్థాయికి చేరాయి.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్స్‌ రేట్లను 1.75నుంచి 2 శాతానికి పెంచడంతో డాలరుతోపాటు బాండ్ల ఈల్డ్స్‌ ఊపందుకున్నాయి. ఈ ఏడాది మరో రెండుసార్లు ఫెడ్‌ వడ్డన తప్పదన్నసంకేతాలతో డాలరు ఇండెక్స్‌ తాజాగా 11 నెలల గరిష్టానికి చేరింది. మరోపక్క బాండ్ల కొనుగోలు ప్రక్రియకు ముగింపు పలకనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. మరోవైపు ప్రపంచంలోనే రెండోపెద్ద దిగుమతిదారు అయిన ఇండియాలో వరుసగా అయిదవ నెలలో మే నెలలో కూడా పసిడి దిగుమతి క్షీణతను నమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు