దేశంలో పసిడికి సీజనల్ డిమాండ్: నిపుణులు

18 Apr, 2016 02:16 IST|Sakshi
దేశంలో పసిడికి సీజనల్ డిమాండ్: నిపుణులు

ముంబై: దేశీయంగా ఉన్న డిమాండ్ సమీప కాలంలో పసిడి ధరలకు పటిష్టత చేకూర్చుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.  అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు.. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోదన్న అంచనా సైతం పసిడికి సమీప కాలం లో బలం చేకూర్చుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,150 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన.

కాగా దేశీయంగా పసిడి వరుసగా రెండవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో  99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారీ వారీగా రూ.325 లాభపడి రూ.29,060 వద్ద ముగిసింది. 99.9 ప్యూరి టీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,210 వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 1,755 లాభపడి రూ.38,375 వద్దకు పెరిగింది. ఇక నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా 9 డాలర్లు తగ్గి 1,234 డాలర్ల వద్ద ముగిసింది. వెండి  15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది.

మరిన్ని వార్తలు