పసిడి ధరలు పైపైకి

7 Jan, 2016 14:59 IST|Sakshi
పసిడి ధరలు పైపైకి

ముంబై: చాలాకాలం స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన పసిడి ధర మూడు వారాల గరిష్ట స్థాయికి పెరిగింది. డ్రాగన్ ఎఫెక్ట్తో  అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూస్తోంటే  బంగారం ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. గత కొన్నిరోజులుగా 25 వేల మార్కుకు దిగువన ట్రేడవుతున్న పసిడి ధరలు  గురువారం  పైపైకి ఎగబాకాయి. యూరోప్, ఆసియా మార్కెట్ల పతనంతో   అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో  పసిడికి డిమాండ్ పెరిగింది.

ఇవాళ ఒక్కరోజే  దాదాపు రూ.430పైగా లాభపడి ఈ ఏడాది అత్యధిక ధరలను నమోదు చేసింది.  దీంతో పసిడి  మూడువారాల గరిష్ట స్థాయి రూ. 26, 330ను అధిగమించింది.  దీంతో పాటుగా వెండి ధరలు  కూడా అనుకూలంగానే స్పందించాయి. రూ.250 పెరుగుదలతో కిలో వెండి ధర రూ.34 వేలకు చేరుకుంది.  అటు కరెన్సీ మార్కెట్లో భారతీయ రూపాయి విలువ బలహీనంగా ఉంది. ఇది కూడా పసిడి ధరల్లో పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి  కారణంగా  మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.  ఈ ప్రభావంతోనే బులియన్ మార్కెట్ సానుకూలంగా రియాక్టవుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టుల నుంచి కొత్తగా కొనుగోళ్లకు డిమాండ్ పెరిగితే  బంగారం ధరలు మరింత  పెరిగే  అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు.

మరిన్ని వార్తలు