పసిడి అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌లు

4 Jun, 2018 01:05 IST|Sakshi

అమెరికాలో పెరిగిన ఉద్యోగాలు

పటిష్ఠంగా డాలర్‌ ఇండెక్స్‌

జూన్‌ 13 ఫెడ్‌ భేటీలో రేటు పెంపు!

ప్రస్తుతానికి ఇవీ అడ్డంకులు  

పసిడి పరుగుకు బ్రేక్‌ పడే అవకాశాలు స్పష్టమయ్యాయి. పసిడి మళ్లీ కీలక నిరోధ స్థాయి 1,300 డాలర్ల కిందికి పడిపోయింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌– నైమెక్స్‌లో 1వ తేదీతో ముగిసిన వారంలో 9 డాలర్ల నష్టంతో 1,293 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో బంగారం ఔన్స్‌ (31.1గ్రా)ధర 2018 జనవరి నుంచీ పసిడి 1,300–1,370 డాలర్ల శ్రేణిలో తిరిగింది.
   అయితే మే 18వ తేదీతో ముగిసిన వారంలో 27 డాలర్లు పడిపోయి, 1,291 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది పసిడి 1,300 డాలర్ల కీలక మద్దతును కోల్పోవడం అదే తొలిసారి.
 కాగా మే 25వ తేదీతో ముగిసిన వారంలోనే తిరిగి 10 డాలర్ల పెరుగుదలతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఈ స్థాయిని నిలుపుకోలేక మళ్లీ 1,300 డాలర్ల దిగువకు చేరింది.
 రానున్న ఒకటి రెండు వారాల్లో పసిడి 1,325 డాలర్లు దాటి స్థిరపడని పరిస్థితి ఉంటే,  సమీపకాలంలో 1,240 డాలర్ల స్థాయిని చూసే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్షణం ఎగువున 1,310 డాలర్లు నిరోధం కాగా, 1,270 తక్షణ మద్దతని వారి అభిప్రాయం.
దిగువ అంచనాలకు కారణాలు ఇవీ...
    శుక్రవారం వెలువడిన అమెరికా ఉపాధి అవకాశాల మే నివేదిక ఆర్థికవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. 1,89,000 ఉద్యోగాల సృష్టే జరుగుతుందని భావిస్తే, ఏకంగా 2,23,000 కొత్త ఉద్యోగాలు లభించాయి. నిరుద్యోగ రేటు 18 నెలల కనిష్ట స్థాయి 3.8 శాతానికి పడిపోయింది.
   అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహ పరిస్థితులు డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టతకు కారణమవుతున్నాయి. 1వ తేదీతో ముగిసిన వారంలో 94.16 స్థాయిలో ఇది పటిష్ఠంగా ముగిసింది.  
 ఇవన్నీ కలిసి జూన్‌లో అమెరికా ఫెడ్‌ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి) మరో పావుశాతం పెంపునకు కారణమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. జూన్‌ 13న ఫెడ్‌ సమావేశం జరుగనుంది. అయితే ఈ పెంపునకు డాలర్‌ ఇండెక్స్‌ ఎలా స్పందిస్తుందన్నది ఇక్కడ ముఖ్యాంశం.
 ఇక అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కూడా సమసిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా–ఉత్తరకొరియా అగ్రస్థాయి చర్చలు ఈ నెల 12న జరగనుండటం గమనార్హం.
 సోమవారం నాడు అమెరికా డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్ల నివేదిక రానుంది. మంగళవారం మార్కెట్‌ పీఎంఐ నివేదిక వస్తుంది. అదేరోజు ఐఎస్‌ఎం నాన్‌–మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ నివేదిక కూడా విడుదల కానుంది.
 ఆయా అంశాలన్నీ సమీప కాలంలో పసిడికి ప్రతికూలమేనన్న అంచనాలు ఉన్నాయి. ఫెడ్‌ రేటు పెంచకపోతే మాత్రం పసిడికి మళ్లీ బులిష్‌ ట్రెండ్‌ ఉంటుందన్న అభిప్రాయం ఉంది.


దేశంలోనూ నష్టాలే..
అంతర్జాతీయంగా పసిడి బలహీన ధోరణి, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలోపేతం (1వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా 21పైసలు నష్టంతో 66.93 వద్ద ముగింపు) వంటి అంశాలు దేశంలో పసిడి ధరలపై ప్రభావితం చూపాయి.

దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల పసిడి ధర వారం వారీగా  రూ.643 నష్టంతో రూ. 30,546 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత వారంలో రూ.385 చొప్పున నష్టపోయి రూ.30,970, రూ.30,820 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.815 పడిపోయి రూ.39,390 వద్దకు దిగింది. 

మరిన్ని వార్తలు