ప్రభుత్వ బ్యాంకులపై అంచనాల కోత

23 Feb, 2018 00:21 IST|Sakshi

షేర్ల ధరల లక్ష్యాలూ తగ్గింపు

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూపు భారత్‌కు చెందిన మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆదాయ అంచనాలను తగ్గించింది. ఆయా బ్యాంకుల షేర్ల ధరల అంచనాలకూ కోతేసింది. ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ స్కామ్‌ వెలుగు చూసిన నేపథ్యంలో ఈ మేరకు సవరణలు చేసింది. ఎస్‌బీఐ ఒక శాతం మేర, బ్యాంకు ఆఫ్‌ బరోడా 12 శాతం మేర, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 30 శాతం మేర ఆదాయాన్ని కోల్పోతాయని గోల్డ్‌మ్యాన్‌ అంచనాలు వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వ భారీ రీక్యాపిటలైజేషన్‌ సాయంలో మొదటి విడత అందిన నిధులను పరిగణనలోకి తీసుకుని మరీ అంచనాలకు కోతేయడం గమనార్హం. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి కూడా ఈ మేరకు అంచనాలను తగ్గించింది. రిస్క్‌ భరించాల్సిన సామర్థ్యం, స్కామ్‌ అనంతరం నియంత్రణలపై మరింత దృష్టి సారించాల్సి రావడం అన్నవి స్వల్ప కాలంలో వృద్ధిని దెబ్బతీయవచ్చని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అనలిస్ట్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

ఎస్‌బీఐ, బీవోబీలకు సంబంధించి ఈక్విటీ విస్తరణ కారణంగా ఈపీఎస్‌ అంచనాలను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా పీఎన్‌బీలో స్కామ్‌ కారణంగా కేటాయింపులు పెరిగి ఈపీఎస్‌ గణనీయంగా తగ్గుతుందని, వృద్ధి కూడా తక్కువగానే ఉంటుందని పేర్కొంది. పీఎన్‌బీలో స్కామ్‌ బయటకు వచ్చిన తర్వాత స్టాక్‌ మార్కెట్లో బ్యాంకు షేర్లు భారీగా పడిన సంగతి తెలిసిందే.

కుంభకోణంతో పీఎన్‌బీపై దిద్దుబాటు చర్యలు
భారీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పీఎన్‌బీలో కొన్నాళ్ల పాటు రుణ వితరణ కార్యకలాపాలు నిల్చిపోవచ్చని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. కుంభకోణం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు అమలు చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని వివరించింది. 

స్కామ్‌  ఉదంతంతో మూలధన నిష్పత్తిపై సుమారు 230 బేసిస్‌ పాయింట్ల మేర ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. దీంతో తగినంత స్థాయికి మూలధనం పెంచుకునేదాకా పీఎన్‌బీ రుణ వితరణను నిలిపివేయొచ్చని కోటక్‌ వివరించింది. ఒకవేళ నిధుల సమీకరణ కోసం కొన్ని అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్స్‌లో వాటాలు విక్రయించినా.. కాంట్రాక్టుల నిబంధనల ప్రకారం ఆ నిధులు చేతికొచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది.   


బ్యాంకుల ఆదాయం తగ్గుతుంది
ఆర్‌బీఐ కొత్త నిబంధనలపై ఫిచ్‌ అంచనాలు
మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసే లక్ష్యంతో ఆర్‌బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలు స్వల్పకాలంలో బ్యాంకింగ్‌ రంగ ఆదాయాలను దెబ్బతీయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అభి ప్రాయపడింది. అయితే, ప్రభుత్వం నుంచి మూలధన సాయం, మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు నియంత్రణ పరంగా బలమైన చర్యల వల్ల మధ్యకాలంలో ఈ రంగం పుంజుకుంటుందని తన నివేదికలో అంచనా వేసింది.

దేశ బ్యాంకింగ్‌ రంగంపై ఈ సంస్థ ప్రతికూల ధోరణితో ఉంది. బ్యాంకులు భారీగా రుణం తీసుకున్న వారి ఎగవేతల గురించి ప్రతీ వారం వెల్లడించాల్సి ఉంటుందని, మొండి బాకీల పరిష్కారంలో వేగవంతమైన విధానాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు