వృద్ధి వేగానికి బ్యాంకింగ్‌ కష్టాలు అడ్డు!

21 Mar, 2018 01:11 IST|Sakshi

అంతర్జాతీయ బ్యాంకింగ్‌  సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత్‌ వృద్ధికి విఘాతం కలిగించనున్నట్లు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– గోల్డ్‌మన్‌ శాక్స్‌ విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలనూ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 7.6 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 8 శాతం.

  ప్రభుత్వ రంగంలో రెండవ బ్యాంకింగ్‌ దిగ్గజం– పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో దాదాపు రూ.13,000 కోట్ల కుంభకోణం గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా అంచనాలకు నేపథ్యం... రెండేళ్ల కాలానికి రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని బ్యాంకింగ్‌కు ప్రకటిస్తూ, రుణ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఈ చర్య దోహదపడుతుందని ప్రకటిస్తున్న కేంద్రానికి గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా నివేదిక ఆందోళన కలిగించేదే.  బ్యాంక్‌ విడుదల చేసిన అంచనాల్లో ముఖ్యాంశాలను చూస్తే...

ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో...బ్యాంకింగ్‌ రంగంలో కఠినతరమైన నియంత్రణ విధానాలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది రుణ వృద్ధికి తద్వారా ఆర్థిక వేగానికి విఘాతం కలిగిస్తుంది.   
 ఇక బ్యాంకులపై మొండిబకాయిల భారం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లలో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల ఎన్‌పీఏల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది.  
 మొండిబకాయిలకు ప్రొవిజనింగ్‌లు పెంచాల్సి రావడం, రుణ వృద్ధిపై పరోక్షంగా తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది.  
 భారత్‌ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.6 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. 2019–20లో 8.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న తొలి అంచనాల్లో ఇప్పటికి ఎటువంటి మార్పూ లేదు. 

మరిన్ని వార్తలు