ఆర్థిక వ్యవస్థకు... ఇక మంచిరోజులు!

28 Nov, 2017 00:21 IST|Sakshi

ఆర్థిక విశ్లేషణా సంస్థల అంచనా

2018లో వృద్ధి రేటు 7.2 శాతం: మెక్వైర్‌ విశ్లేషణ

2018–19లో 8 శాతం ఖాయం: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అభిప్రాయం

మోర్గాన్‌స్టాన్లీదీ సానుకూల మాటే...  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2018 క్యాలెండర్‌ ఇయర్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్, ఆర్థిక సేవల గ్రూప్‌ మెక్వైర్‌ తన నివేదికలో విశ్లేషించింది. ఇక 2018–19లో 8% వృద్ధి నమోదవుతుందని వాల్‌ స్ట్రీట్‌ బ్రోకరేజ్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. భారత్‌ వృద్ధికి తగిన బాటలు పడుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి రేటు 7.1% నుంచి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7%కి పడిపోయి, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వెలువడిన తాజా నివేదికలు కొంత ఊరటనిస్తున్నాయి.  

వృద్ధికి మూడు ప్రధాన కారణాలు: మెక్వైర్‌ 
భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి మెక్వైర్‌ మూడు కారణాలను చూపింది. గ్రామీణ వినియోగం మెరుగుదల, ఎగుమతుల పురోగతి, ప్రభుత్వ వ్యయాల పెరుగుదల వృద్ధి పుంజుకోవడానికి దారితీస్తాయని పేర్కొంది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌కు రూ.2.11 లక్షల కోట్ల ప్రభుత్వ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూల అంశంగా వివరించింది. ఆర్థిక సంస్కరణలు దేశ వృద్ధిరేటు పటిష్టతకు దోహదపడతాయని వివరించింది.  

వృద్ధి లక్ష్యంగా బాటలు: మోర్గాన్‌స్టాన్లీ 
వృద్ధికి దోహదపడే అంశాలన్నీ 2018–19 నాటికి పటిష్టమవుతాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడుల్లో పురోగతిని భారత్‌ వృద్ధికి కారణంగా పేర్కొన్న మోర్గాన్‌ స్టాన్లీ, ఈ పరిణామం భారత్‌ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగా నమోదు కావడానికి దోహదపడుతుందని సంస్థ ఆసియా వ్యవహారాల చీఫ్‌ ఎకనమిస్ట్‌ చేతన్‌ ఆహ్యా పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు