వివేకంతోనే బ్యాంకుల్లో గుడ్‌ గవర్నెన్స్‌

15 Jun, 2018 00:37 IST|Sakshi

యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉందన్నది ప్రశ్న కాదు

ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యలు...

ముంబై: బ్యాంకర్లు వివేకవంతంగాను, అణకువగాను వ్యవహరించినప్పుడు.. నిబంధనలను సరళంగాను ఉంచగలిగినప్పుడే బ్యాంకుల్లో గుడ్‌ గవర్నెన్స్‌ అమలు కాగలదని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్‌ అభిప్రాయపడ్డారు. అంతే తప్ప, బ్యాంకులు సరిగ్గా పనిచేయాలంటే పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలనో లేదా యాజమాన్యం ఏ ఒక్కరికో పరిమితం కాకుండా పలువురి చేతుల్లో ఉండాలనో అనుకుంటే అమాయకత్వమే అవుతుందన్నారు.

షేర్‌హోల్డర్లకు పంపిన వార్షిక సందేశంలో కొటక్‌ ఈ విషయాలు వివరించారు. ఒకవైపు ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఈవో చందా కొచర్‌ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారన్న ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ. 14,000 కోట్ల స్కామ్‌ బైటపడటం వంటి పరిణామాల నేపథ్యంలో కొటక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చట్టాల్లో స్ఫూర్తిని గ్రహించి అమలు చేయడం ద్వారా బ్యాంకింగ్‌ రంగం మళ్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలదని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు