ఫ్రెషర్స్‌కు టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌

3 Oct, 2018 11:58 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీయ ఐటీ ఉద్యోగార్ధులుకు గుడ్‌ న్యూస్‌. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) ఐటీ ఫ్రెషర్స్‌కు ఈ శుభవార్త అందించింది. లేటెస్ట్‌ నైపుణ్యాలున్న  ఫ్రెష్‌ ఇంజనీర్లకు చెల్లించే ప్యాకేజీని రెట్టింపు చేసింది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన టెకీలకు ఇకపై టీసీఎస్ వార్షిక ప్రాతిపదిక 6.5 లక్షల  రూపాయల జీతాన్ని చెల్లించనుంది. ఐటీ పరిశ్రమలో భారతీయ ఇంజనీర్ల ఎంట్రీ స్థాయి జీతం సంవత్సరానికి సుమారు 3.5 లక్షల రూపాయలు మాత్రమే.

టీసీఎస్‌లో ఉద్యోగం పొందాలనుకునే ఇంజనీర్లు ఆన్‌లైన్‌ పరీక్షను పాస్‌ కావాల్సి ఉంటుంది. సంస్థలో నియామక ప్రక్రియను కూడా డిజిటలైజ్‌ చేసిన టీసీఎస్‌ ఈ ఏడాది దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ప్రారంభించింది. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హత సంపాదించిన అనంతరం వీడియో లేదా ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరోవైపు టీసీఎస్‌ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఐఆన్‌(iON )పరీక్ష కోసం నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 24 రాష్ట్రాల్లోని వంద నగరాలనుంచి 2లక్షల 80వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. మెషీన్‌లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌ ప్లాట్‌ఫాంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన తాము ఇప్పటికే వెయ్యిమందిని ఎంపకి చేశామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి అజయ్‌ ముఖర్జీ ప్రకటించారు. అయితే  ఇంకా ఎంతమందిని  నియమించుకోనున్నారనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉండవచ్చని వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవల మార్కెట్‌ క్యాప్‌ పరంగా రిలయన్స్‌ను వెనక్కి నెట్టిన టీసీఎస్‌ ఈ రేసులో టాప్‌ కంపెనీగా నిలిచింది. 8 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్‌ అవతరించింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును అధిగమించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు