6 నెలల్లో 22 లక్షల కొత్త కొలువులు

26 Apr, 2018 18:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మోదీ సర్కార్‌పై విపక్షాలు, విమర్శకులు విరుచుకుపడుతున్న వేళ ప్రభుత్వానికి తీపికబురు అందింది. గత ఆరు నెలల్లో ( ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్‌ఓ, ఎన్‌పీఎస్‌లు జారీ చేసిన తాజా పేరోల్‌ జాబితా వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం 31 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా ఖాతా తెరిచారని..వీరిలో 18.5 లక్షల మంది 18-25 సంవత్సరాల వయసు వారున్నారని, వీరంతా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారని అంచనా.

ఇక 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేలింది. ఈపీఎఫ్‌ఓ, ఎన్‌పీఎస్‌తో పాటు ఉద్యోగుల ఆరోగ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సైతం గణాంకాలను వెల్లడింది. గత ఆరునెలల్లో ఈఎస్‌ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా కల్పించినట్టు ప్రకటించింది. ఆధార్‌ వెరిఫికేషన్‌ ద్వారా వీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారని వెల్లడైతే గత ఆరునెలల్లో 30 లక్షల మందికి పైగా ఉపాధి లభించినట్టువుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు