రాబడుల్లో ‘డైనమిక్‌’..

26 Aug, 2019 11:31 IST|Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌

లాంగ్‌ డ్యూరేషన్‌ గిల్ట్‌ ఫండ్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. పదేళ్ల జీసెక్‌ ఈల్డ్స్‌ 80–90 బేసిస్‌ పాయింట్ల మేర పడిపోవడం గిల్ట్‌ ఫండ్స్‌ రాబడులకు దారితీసింది. అయితే, జూలై నెలలో 60 బేసిస్‌ పాయింట్ల వరకు ర్యాలీ చేసిన తర్వాత గత వారంలో పదేళ్ల జీసెక్‌ ఈల్డ్స్‌ తిరిగి స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పై నెలకొన్న ఆందోళనలే ఇందుకు కారణం. ఆర్‌బీ ఐ ఇటీవలే రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడం గిల్ట్‌ ఫండ్స్‌కు అనుకూలించేదే. ఎన్నో అంశాలు బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంటాయి. కనుక వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం రిటైల్‌ ఇన్వెస్టర్లకు నిజంగా ఓ టాస్క్‌ అనుకోవాలి. మోస్తరు రిస్క్‌ తీసుకునేవారు, బాండ్‌ ధరల ర్యాలీని సొమ్ము చేసుకోవాలనుకునే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌ తరహా డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.

పనితీరు..: డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ వివిధ కాల వ్యవధులతో కూడిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. దీని ద్వారా వడ్డీ రేట్లలో మార్పుల ప్రభావాన్ని ఇవి అధిగమించగలవు. రేట్ల మార్పుల అంచనాల ఆధారంగా ఫండ్‌ మేనేజర్లు ఒకే కాల వ్యవధితో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌ పథకం అన్ని రకాల మార్కెట్‌ పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను ఇచ్చిన చరిత్ర కలిగి ఉంది. ఈ పథకం ఏడాది కాలంలో 9.9 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 7.8 శాతం, ఐదేళ్లలో 10 శాతం వార్షిక సగటు రాబడులను ఇచ్చింది. కానీ, డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడులు ఏడాది కాలంలో 9.3 శాతం, మూడేళ్లలో 6.3%, ఐదేళ్లలో 8.3%గా ఉన్నాయి. ఈ విభాగంతో పోలిస్తే ఒక శాతం అధికం గా ఈ పథకం రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది.

పెట్టుబడుల విధానం..: ముఖ్యంగా 2014–16 మధ్య కాలంలో ఈ పథకం 16–19% వరకు రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇక 2017లో బాండ్‌ మార్కెట్‌కు ప్రతికూలంగా ఉన్న ఏడాదిలో ఈ పథకం 5 శాతం రాబడులను ఇచ్చింది. దీర్ఘకాలిక గిల్ట్‌ ఫండ్స్‌ సైతం ఈ కాలంలో కేవలం 2–3 శాతమే రాబడులను ఇచ్చాయి. బాండ్‌ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ పోర్ట్‌ఫోలియోలో చేసే మార్పులే ఈ పథకం రాబడులు గొప్పగా ఉండేందుకు తోడ్పడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్‌ ధరలు తగ్గుతాయి. అదే విధంగా వడ్డీ రేట్లు పడిపోతే బాండ్‌ ధరలు పెరుగుతాయి. వడ్డీ రేట్లు, బాండ్ల ధరలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గత మూడు సంవత్సరాల్లో ఈ పథకం పెట్టుబడులను గమనిస్తే ఏడాది నుంచి 13 ఏళ్ల కాల మెచ్యూరిటీతో కూడుకుని ఉండడం గమనార్హం. ప్రస్తుత ఈ పథకం పెట్టబడుల్లో 37 శాతం వరకు ఏఏఏ, వీటికి సమానమైన రేటింగ్‌ పథకాల్లో, 41 శాతం వరకు ఏఏ రేటింగ్‌ పథకాల్లో ఉన్నాయి. 19.6% వరకు సార్వభౌమ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తలు