సేవలే మంచి సంబంధాలకు పునాది..

14 Sep, 2014 00:57 IST|Sakshi
సేవలే మంచి సంబంధాలకు పునాది..

బీమా సంస్థ-పాలసీదారు మధ్య దీర్ఘకాలికంగా మంచి సంబంధాలు కొనసాగడం ఒక జీవిత బీమా పాలసీకి సంబంధించి ముఖ్యాంశం. ఇక్కడ విశ్వసనీయత పెంపొందడం అవసరం. విశ్వసనీయత పెం పొందడానికి బీమా సంస్థ అందించే నాణ్యమైన సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఎన్నో అంశాలపై చైతన్య వంతులైన కస్టమర్లు బీమా సంస్థల నుంచి అత్యుత్తమమైన సేవలను కోరుకుంటున్నారు.
 
వారి అవసరాలు ఏమిటి, సంస్థ నుంచి వారు ఏమి కోరుకుంటున్నారు వంటి అంశాలను బీమా సంస్థలు తెలుసుకోవడంతో సరిపోదు. వాటిని నెరవేర్చడంపై సైతం దృష్టి పెట్టాలి. పాలసీల విక్రయానికి కస్టమర్లను ఆకర్షించడం - వారు ఆయా పాలసీ ప్రొడక్టులతో కొనసాగేలా చూడడం ఎంతో ముఖ్యం. ఇందుకు నాణ్యమైన సేవలే ఆధారం.

వివిధ రకాలు...
అయితే ఈ సేవలు ఎలాంటివి అన్న అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. వివిధ దశల్లో పలు రూపాల్లో ఇవి ఉంటాయి. పాలసీలకు సంబంధించి కస్టమర్‌ను చైతన్యవంతుడిని చేయడం, ఫండ్ పనితీరుపై ఎప్పుటికప్పుడు సమాచారాన్ని అందించడం, ఏదైనా వివాదం తలెత్తితే ఆ సమస్య తక్షణ పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎటువంటి జాప్యానికి, ఇబ్బందులకు తావు లేకుండా క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి అంశాలన్నింటినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి బీమా సంస్థ ఏజెంటూ వ్యక్తిగతంగా పాలసీ హోల్డర్ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అవసరం.
 
సాంకేతికత...
కాగా బీమా రంగ కంపెనీల్లో కార్యకలాపాలకు సంబంధించి నెలకొల్పిన సాంకేతిక అంశాలు ఇప్పుడు కస్టమర్ల సేవలకు సంబంధించి అత్యుత్తమమైనవిగా భావించవచ్చు. పలు బీమా సంస్థలు తమకు అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగం ద్వారా కస్టమర్లకు కావల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతున్నాయి. కస్టమర్లు ఇప్పుడు బీమా సంస్థ బ్రాంచీలకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఆన్‌లైన్ ద్వారానే ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యత నెలకొంది. ఒక్క ఎస్‌ఎంఎస్‌తో తన ఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా కస్టమర్ తెప్పించుకునే సదుపాయాన్ని పలు సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా సాంకేతికత అంశాలపై వినియోగదారుడిని చైతన్యవంతుడిని చేయడమూ సేవల్లో భాగంగానే బీమా సంస్థలు భావించాలి.

మరిన్ని వార్తలు