ఇక కంప్యూటర్లు ఉండవు..!

30 Apr, 2016 08:25 IST|Sakshi
ఇక కంప్యూటర్లు ఉండవు..!

గూగుల్ బ్లాగ్‌లో సుందర్ పిచాయ్ లేఖ

 న్యూయార్క్: భవిష్యత్తులో భౌతిక కంప్యూటర్లకు స్థానం ఉండదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనా వేస్తున్నారు. డివైస్ అనే భావనకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ భౌతికంగా కాకుండా ఏ రూపంలో ఉన్నప్పటికీ, మన రోజువారీ కార్యకలాపాల్లో ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌గా సహాయపడుతుందని వివరించారు. స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రూపరహిత ఉత్పత్తులు పెరుగుతాయని తెలిపారు. 

మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారతామని వివరించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఊహించని విధంగా ఇప్పుడు సర్వం స్మార్ట్‌ఫోనే అయ్యిందని పేర్కొన్నారు. రోజు వారీ జీవితానికి స్మార్ట్‌ఫోన్ రిమోట్ కంట్రోల్‌లా పనిచేస్తోందన్నారు. విద్యకు, వినోదానికి, కమ్యూనికేషన్‌కు, వినియోగానికి... అన్నింటికీ ప్రజలు స్మార్ట్‌ఫోన్‌నే  ఉపయోగిస్తున్నారని  పేర్కొన్నారు. వాయిస్‌తో సమాచారాన్ని సెర్చ్ చేయడం పెరుగుతుందని వివరించారు. అయితే ఇక ముందు డివైస్ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆక్రమిస్తుందని అన్నారు.

 అత్యుత్తమ ఏఐ టీమ్: త్వరలో గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని పిచాయ్ తెలిపారు. తమ ఫొటోలను, వీడియోలను సులభంగా నిర్వహించుకునేలా, వాటిని సురక్షితంగా ఉంచుకునేలా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటిని చూసుకునేలా ఈ గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ను అందిస్తామన్నారు.  ఇదంతా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్ ప్లేను ఉపయోగించుకుంటున్న ఆండ్రాయిడ్ యూజర్ల సంఖ్య వంద కోట్లను దాటిందని తెలిపారు.

 సంప్రదాయానికి బ్రేక్: గూగుల్ ప్రగతి, భవిష్యత్ ప్రాధాన్యతల  గురించి సాధారణంగా ప్రతి ఏడాది ఆ కంపెనీ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ వెల్లడిస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం గూగుల్ సీఈఓగా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి  పిచాయ్ బ్రేక్ చేశారు. గూగుల్ సాధించిన ఘనతలు, తదితర అంశాల గురించిన ఒక లేఖను గూగుల్ అధికారిక బ్లాగ్‌లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. ప్రపంచ సమాచారాన్ని నిర్వహించడం, దీనిని విశ్వవ్యాప్తంగా అందరూ యాక్సెస్ చేయడం, వినియోగించడం చేయడంపైననే దృష్టి పెడతామని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖ గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ పేజ్ స్వల్ప ముందుమాటతో ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు