రిలయన్స్‌ జియోలో గూగుల్‌కు వాటా

15 Jul, 2020 14:50 IST|Sakshi

జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడికి రెడీ

రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌

7.7 శాతం వాటా కొనుగోలుకి గూగుల్‌ సై

చౌకగా 4జీ/5జీ స్మార్ట్‌ ఫోన్ల తయారీ

ఏజీఎంలో వెల్లడించిన ముకేశ్‌ అంబానీ

ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షించింది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు డిజిటల్‌, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తాజాగా ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. తద్వారా రిలయన్స్‌ జియోలో 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేశారు. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు వివరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వీడియో కాన్ఫెరెన్సింగ్‌ ద్వారా నిర్వహిస్తున్న ఏజీఎంలో ఈ వివరాలు తెలియజేశారు. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్‌ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం యథాతథంగా రూ. 1918 వద్ద ట్రేడవుతోంది. తొలుత 2.2 శాతం ఎగసి రూ. 1989 సమీపానికి చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!

క్వాల్‌కామ్‌తో..
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో చివరిగా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఇప్పటికే ఆర్‌ఐఎల్‌ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది.  జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్‌ దిగ్గజాలు ఇంటెల్‌, క్వాల్‌కామ్‌.. పీఈ సంస్థలు కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌ తదితరాలు ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది. మార్చికల్లా ఆర్‌ఐఎల్‌ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు