ఆ నెంబర్‌ మా పొరపాటే : గూగుల్‌

4 Aug, 2018 10:36 IST|Sakshi
ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్‌లోకి యూఐడీఏఐ నెంబర్‌

స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల ప్రమేయం లేకుండా.. వారి కాంటాక్ట్‌ లిస్ట్‌లోకి కొత్తగా జతచేరిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌... ఎక్కడ నుంచి వచ్చిందని యూజర్లు తలబద్దలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది తమ తప్పిదం కాదని యూఐడీఏఐ తేల్చేసింది. అయితే ఈ పని ఎవరు చేశారంటూ అని అనుకుంటుండగా.. సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ అనూహ్య ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్‌లోకి వచ్చిన యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ తమ తప్పిదమేనని గూగుల్‌ ప్రకటించింది. తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించింది. దీనిపై గూగుల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. కోడింగ్‌ తప్పిదం కారణంగా పాత టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-300-1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్‌ 112 యూజర్ల సెటప్‌ విజార్డ్‌లోకి చేరిపోయాయని గూగుల్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

అయితే ఇది తాము ఏ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలోకి అనధికారికంగా చొరబడాలని చేసింది కాదని స్పష్టంచేసింది. యూజర్లు తమ డివైజ్‌ల నుంచి ఈ నెంబర్‌ను మాన్యువల్‌గా డిలీట్‌ చేయొచ్చని పేర్కొంది. కాగ, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రమేయం లేకుండా యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ జతచేరిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ వేలాది ఫోన్లలో శుక్రవారం కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు. ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్‌షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అప్పటికీ ఈ గందరగోళంపై యూఐడీఏఐ ఇది అసలు తమ వాలిడ్‌ నెంబర్‌ కాదంటూ తేల్చేసింది.  తమ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947 అని, రెండేళ్లకు పైగా దీన్నే వాడుతున్నామని ప్రకటించింది. 

మరిన్ని వార్తలు