హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్

22 Dec, 2014 00:03 IST|Sakshi
హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్

హైదరాబాద్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సొంత, అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇది కార్యరూపం దాలిస్తే యూఎస్, యూకే తర్వాత సంస్థకు మూడవ క్యాంపస్ అవుతుందని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం గూగుల్ హైదరాబాద్ క్యాంపస్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తోంది. సొంత భవనంలోకి మారాలని చూస్తోందని ఆయన చెప్పారు.

ఇక హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దే హైఫై ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఎయిర్‌టెల్, సిస్కో, వొడాఫోన్‌తోపాటు తైవాన్‌కు చెందిన ఒక కంపెనీ ఆసక్తి కనబరిచాయని పేర్కొన్నారు. ఈ కంపెనీలు పూర్తిస్థాయి హైదరాబాద్ పటంతోపాటు కొన్ని వివరణలు కోరాయని, తాము ఈ పనిలో నిమగ్నమయ్యామని అన్నారు. మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయని, మూడు నాలుగు నెలల్లో కాంట్రాక్టులు అప్పగిస్తామని పేర్కొన్నారు.

ఇంక్యుబేషన్ సెంటర్: టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం రూ.30 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదిత ఇంక్యుబేషన్ కేంద్రం డిజైన్ పూర్తి అయిందని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. 800 సీట్ల సామర్థ్యం గల ప్రతిపాదిత సెంటర్‌లో 500 స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు సాగించొచ్చు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ సెంటర్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మరిన్ని వార్తలు