చిన్న సంస్థలకు గూగుల్‌ దన్ను..!

5 Jan, 2017 00:26 IST|Sakshi
గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ను అభినందిస్తున్న టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.

భారత్‌ లక్ష్యంగా డిజిటల్‌ ఉత్పత్తులు
డిజిటల్‌ అన్‌లాక్డ్‌ శిక్షణా కార్యక్రమాలు
ప్రైమర్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన సీఈవో సుందర్‌ పిచాయ్‌
త్వరలో మై బిజినెస్‌ వెబ్‌సైట్స్‌


న్యూఢిల్లీ: దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంబీ) డిజిటల్‌ బాట పట్టేలా తోడ్పాటు అందించడంపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పలు కొత్త ఆవిష్కరణలను ప్రకటించింది.  భారత పర్యటనలో ఉన్న సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ బుధవారం వీటిని ప్రకటించారు. డిజిటల్‌ అన్‌లాక్డ్‌ శిక్షణా కార్యక్రమాలు, ప్రైమర్‌ మొబైల్‌ యాప్‌ మొదలైనవి ఇందులో ఉన్నాయి. భారతీయ సంస్థల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న ఉత్పత్తులను.. క్రమంగా ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెడతామని గూగుల్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుందర్‌ చెప్పారు. భారత్‌లో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా రూపొందించిన సాధనాలు .. ప్రపంచ దేశాల్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. అందుకే, భారతీయ సంస్థల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేసే దిశగా ఇక్కడి టీమ్‌ను పటిష్టం చేస్తున్నామని సుందర్‌ వివరించారు.

ఎకానమీకి చిన్న సంస్థలే కీలకం..
భారత ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్య తరహా సంస్థలే (ఎస్‌ఎంబీ) చోదకాలని పిచాయ్‌ పేర్కొన్నారు. అటువంటి సంస్థలు డిజిటల్‌ బాట పట్టేందుకు సరైన సాధనాలు అందుబాటులో ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. వృద్ధి బాటలో అవి మరింత వేగంగా ఎదిగేందుకు తగిన శిక్షణనివ్వడంపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని పిచాయ్‌ చెప్పారు. ప్రస్తుతం 80 లక్షల పైగా భారతీయ ఎస్‌ఎంబీలు.. గూగుల్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. గూగుల్‌–కేపీఎంజీ సంయుక్త అధ్యయన నివేదిక ప్రకారం 5.1 కోట్ల పైచిలుకు భారతీయ ఎస్‌ఎంబీల్లో సుమారు 68 శాతం ఇప్పటికీ ఆఫ్‌లైన్‌లోనే ఉన్నాయి.

ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతోండటం, ఎస్‌ఎంబీలు డిజిటల్‌ బాట పట్టడం తదితర పరిణామాలు దేశ జీడీపీలో చిన్న సంస్థల వాటా 10 శాతం మేర పెరిగేందుకు తోడ్పడగలవు. 2020 నాటికి ఇది 46–48 శాతానికి పెరగవచ్చని అంచనా. నివేదిక ప్రకారం.. ఆఫ్‌లైన్‌ ఎస్‌ఎంబీలతో పోలిస్తే డిజిటల్‌కు మారిన ఎస్‌ఎంబీల లాభాలు రెండు రెట్లు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, అవి తమ కస్టమర్ల సంఖ్యను కూడా భారీగా పెంచుకోగలవు. సదరు సంస్థలు ఆఫ్‌లైన్లో ఉండిపోవడానికి.. సాంకేతిక నైపుణ్యాలు కొరవడటం, డిజిటల్‌ టెక్నాలజీ ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం తదితర అంశాలే ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది.

5వేల పైచిలుకు వర్క్‌షాపులు..
ఎస్‌ఎంబీలు ఈ సవాళ్లను అధిగమించడానికి తోడ్పడేలా గూగుల్‌.. డిజిటల్‌ అన్‌లాక్డ్‌ పేరిట శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. వ్యాపారాలను విస్తరించుకునే దిశగా ఎస్‌ఎంబీలు డిజిటల్‌ మాధ్యమాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో కలిసి గూగుల్‌ ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. డిజిటల్‌ అన్‌లాక్డ్‌ కార్యక్రమం కింద రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 5,000 పైచిలుకు గూగుల్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కింద.. ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌లో భారత సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన దాదాపు 90 వీడియో ట్యుటోరియల్స్‌ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

గూగుల్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, ఫిక్కీ ఈ శిక్షణా కార్యక్రమాలను సర్టిఫై చేస్తాయి. మరోవైపు ప్రైమర్‌ పేరిట డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలపై శిక్షణనిచ్చే ఉచిత మొబైల్‌ యాప్‌ను కూడా గూగుల్‌ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, యాపిల్‌ ఫోన్స్‌లో అందుబాటులో ఉండే ఈ ప్రైమర్‌.. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో లభ్యమయ్యే ఈ యాప్‌నకు సంబంధించి త్వరలోనే తెలుగు, తమిళం, మరాఠీ వెర్షన్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న మై బిజినెస్‌ వెబ్‌సైట్స్‌ సాధనాన్ని కూడా గూగుల్‌ ఆవిష్కరించింది.

సైబర్‌ సెక్యూరిటీపైనా దృష్టి పెట్టాలి: మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
గూగుల్‌ అమెరికన్‌ కంపెనీ అయినప్పటికీ..

దానిలో భారతీయత కూడా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. భారతీయులు గూగుల్‌ను ఎంతగానో ఆదరిస్తున్నందున.. భారత్‌ విషయంలో గూగుల్‌ మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. భారతీయుల అనుగుణమైన ఉత్పత్తులు, సాధనాలను రూపొందించడం, సైబర్‌ భద్రతపై మరిం తగా కసరత్తు చేయడం మొదలైన వాటితో దేశీ ఎకానమీ వృద్ధికి గూగుల్‌ తోడ్పాటు అందించాలని మంత్రి సూచించారు. ’రాబోయే 3–4 ఏళ్లలో భారత డిజిటల్‌ ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల పైచిలుకు స్థాయికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఉపయోగపడేలా భారతీయుల ఆకాంక్షలకు తోడ్పడేలా.. స్థానిక భాషల్లో.. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేయడంపై గూగుల్‌ ఇండియా దృష్టిపెట్టాలి’ అని ఆయన చెప్పారు.

గూగుల్, టాటా ట్రస్ట్‌తో మొబిక్విక్‌ జట్టు..
గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు రహిత లావాదేవీల విధానాలను అందుబాటులోకి తెచ్చే దిశగా గూగుల్‌ ఇండియా, టాటా ట్రస్ట్‌తో మొబైల్‌ వాలెట్‌ సంస్థ మొబిక్విక్‌ చేతులు కలిపింది. దీంతో టాటా ట్రస్ట్స్, గూగుల్‌ ఇండియా సంయుక్తంగా చేపట్టిన ’ఇంటర్నెట్‌ సాథీ’ కార్యక్రమాన్ని మరింత మందికి చేరువగా తీసుకెళ్లనున్నట్లు మొబిక్విక్‌ వివరించింది. ఈ ఒప్పందం కింద ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో పైలట్‌ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్‌ అక్షరాస్యత ప్రయోజనాలను 20 కోట్ల మందికి అందించడమే లక్ష్యమని మొబిక్విక్‌ పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!

నేడే మెగా విలీనం

రిలీఫ్‌ ర్యాలీ..!

మీ ఈఎంఐ కట్‌ చేయొద్దా?

హానర్‌ కొత్త ఫోన్‌ ‘30ఎస్‌’

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది