సాయం అందినా తీరు మారదు!

22 Aug, 2018 00:28 IST|Sakshi

అదనపు మూలధనంతో తాత్కాలిక ఊరటే

ప్రభుత్వ రంగ బ్యాంకులపై మూడీస్‌ అంచనాలు

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి అదనపు మూలధనం అందినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడకపోవచ్చని, ఒత్తిళ్లు కొనసాగవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది.   ఆయా బ్యాంకులు నిబంధనలకు అనుగుణంగా మూలధన నిష్పత్తుల స్థాయిని పాటించేందుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే నిధులు సరిపోతాయని వివరించింది. ‘బ్యాంకుల మూలధన నిల్వల పరిస్థితిని మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళిక కింద భారీగా సమకూర్చే నిధులు.. ఆయా బ్యాంకుల తక్షణ క్యాపిటల్‌ నిష్పత్తి అవసరాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది.

ఎందుకంటే, ప్రభుత్వం ముందుగా అంచనా వేసిన దానికి ప్రస్తుతానికి మూలధన లోటు భారీగా పెరిగింది‘ అని భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూపొందించిన నివేదికలో మూడీస్‌ వివరించింది. మొండిబాకీలు, భారీ నష్టాలతో కుదేలవుతున్న పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 2.1 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా గతేడాది రూ. 90,000 కోట్లు సమకూర్చగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 65,000 కోట్లు అందించనుంది. గత నెల (జూలైలో) అయిదు బ్యాంకులకు రూ. 11,300 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. బాసెల్‌ త్రీ నిబంధనల కింద 2019 మార్చి నాటికి కనీసం 8 శాతం మూలధన నిష్పత్తి సాధించేందుకు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులకు కేంద్రం అందిస్తున్న నిధులు సరిపోవచ్చని తమ విశ్లేషణలో తెలుస్తోందని మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అల్కా అన్బరసు చెప్పారు.

రుణ వృద్ధి 5–6 శాతమే ఉండాలి..
నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయిల్లో మూలధన నిల్వలను పాటించాలంటే.. బ్యాంకులు రుణ వృద్ధిని ఒక మోస్తరుగా 5–6 శాతం స్థాయిలోనే కొనసాగించాల్సి ఉంటుందని అల్కా తెలిపారు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రుణ వృద్ధిని మెరుగుపర్చాలనుకుంటే బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూర్చడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ఆమె వివరించారు.

కేంద్రం నుంచి అందే అదనపు మూలధనంతో బ్యాంకులు తమ ప్రొవిజనింగ్‌ కవరేజీని పటిష్టపర్చుకోగలిగినా.. ఒకవేళ ఏదైనా మొండి పద్దును విక్రయించేటప్పుడు భారీగా బకాయిలకు కోతపడిందంటే ఈ నిధులు సరిపోకపోవచ్చని మూడీస్‌ తెలిపింది. ప్రొవిజనింగ్‌ పెంచాల్సి వస్తే.. మూలధన అవసరాలు కూడా గణనీయంగా పెరుగుతాయని వివరించింది. కేంద్రం మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధనాన్ని, ప్రొవిజనింగ్‌కు కావాల్సిన నిల్వలను పెంచుకోగలిగినా.. సరైన సంస్కరణలను అమలు చేయకపోతే ఈ ప్రయోజనాలన్నీ తాత్కాలిక మైనవిగానే ఉంటాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు