పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్‌ ఛాన్స్‌

21 Jun, 2017 13:06 IST|Sakshi
పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్‌ ఛాన్స్‌

న్యూఢిల్లీ : బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు  రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్‌ చేసేందుకు అవకాశమిచ్చింది. పాత రూ.500, రూ.1000 నోట్లను కొత్తనోట్లతో మార్చుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ కాలంలో  పోస్ట్‌ ఆఫీసులు, సహకార  బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పాత నోట‍్లను  నిర్ణీత గడువు లోపల మార్చుకోవచ్చని  వివరించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ  జారీచేసిన  అధికారిక నోటిఫికేషన్‌లో నోట్ల మార్పిడి అంశాన్ని ప్రకటించింది. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు  తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని  తెలిపింది. దీనికి 30 రోజుల వ్యవధిని  ఇచ్చింది.  ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం  ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా  నోట్ల మార్పిడి విలువను పొందవచ్చని తెలిపింది.
సహకార బ్యాంకుల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న పాత నోట్ల నిల్వలు,  రైతులకు రుణాలందించేందుకు  అనేక జిల్లాల కో-ఆపరేటివ్‌ బ్యాంకుల దగ్గర తగిన నిధులు లేవన్ననివేదికల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న  సహకార బ్యాంకులకు,  ముఖ్యంగా మహారాష్ట్ర సహకార బ్యాంకులకు భారీ ఉపశమనం లభించనుంది.

సహకార బ్యాంకులలో కూడా పాత 500, 1000 రూపాయల నోట్లను జమ చేసుకునే అవకాశం కల్పించడంతో కుప్పలు తెప్పలుగా డిపాజిట్ లు వచ్చి  చేరాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లకు గడుపుపెంచాలని ఇవి కోరాయి. నాసిక్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో రద్దయిన పాత నోట్ల విలువ రూ.340 కోట్లు అని, ఈ డబ్బు మార్పడి చేయకపోతే  చెల్లింపులు చేయటం కష్టమవుతుందని  నాసిక్ డిసిసిబి ఛైర్మన్ నరేంద్ర దరాడే  పేర్కొన్నారు.

అయితే డిమానిటైజేషన్‌ తరువాత  దాదాపు ఆరు నెలల తర్వాత, తమ దగ్గర పాత కరెన్సీ నిల్వలు భారీగా ఉన్నాయని,  మార్పిడికి  అవకాశం ఇవ్వాలన్న  వీటి ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు