మరిన్ని బ్యాంకులకు పసిడి దిగుమతి చాన్స్

20 Mar, 2014 00:55 IST|Sakshi
మరిన్ని బ్యాంకులకు పసిడి దిగుమతి చాన్స్

 న్యూఢిల్లీ: పసిడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. వీటిలో యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్‌లు ఉన్నాయి. ఈ దిగుమతుల ప్రక్రియలో 80:20 పథకం వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆగస్టు 14వ తేదీన ప్రవేశపెట్టిన 80:20 పథకం  బంగారం నామినేటెడ్ ఏజెన్సీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం దిగుమతిచేసుకున్న పసిడిలో 20 శాతం తప్పనిసరిగా ఎగుమతి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

ఎగుమతి షరతును అమలుచేస్తేనే తదుపరి పసిడి దిగుమతులకు వీలవుతుంది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ నిబంధనసహా, పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకూ, ఆభరణాల దిగుమతుల విషయంలో 15 శాతం వరకూ పెంచుతూ కేంద్రం గతంలో చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కేవలం 6 బ్యాంకులు, మూడు ఆర్థిక సంస్థలకు 80:20 పథకం కింద బంగారం దిగుమతులు చేసుకుంటున్నాయి. కన్‌సైన్‌మెంట్ ప్రాతిపదికన 21 బ్యాంకులకు  బంగారం, వెండి దిగుమతులకు ఆర్‌బీఐ అనుమతి ఉంది.

బంగారం ఆభరణాల ఎగుమతిదారుల వాస్తవ అవసరాలను నెరవేర్చడానికి బులియన్ దిగుమతులకు కన్‌సైన్‌మెంట్ ప్రాతిపదిక వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వ ఆంక్షలు బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయి, క్యాడ్ కట్టడికి దోహదపడ్డాయి. అయితే దేశీయంగా పరిశ్రమ దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఇటీవల కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి పీ చిదంబరం ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి తాజా అనుమతులు వచ్చాయి.

మరిన్ని వార్తలు