విద్యుత్‌ వాహనాలకు ఊతం

4 Jan, 2020 03:19 IST|Sakshi

ఫేమ్‌–2 కింద 2,636 చార్జింగ్‌ స్టేషన్లకు అనుమతులు

తెలంగాణలో 138, ఏపీలో 266 ఏర్పాటు

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ రెండో విడతలో భాగంగా 2,636 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచి్చంది. 24 రాష్ట్రాల్లోని 62 నగరాల్లో ఇవి ఏర్పాటు కానున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఆయా నగరాల్లో సుమారు 4 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున చార్జింగ్‌ స్టేషన్‌ అందుబాటులోకి రాగలదని ఆయన వివరించారు. చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాల సమస్య తీరనుండటంతో వాహనదారులకు ఊరట లభించడంతో పాటు కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి తయారీ సంస్థలకు కూడా తోడ్పాటు లభించగలదని మంత్రి చెప్పారు.

ఫేమ్‌ ఇండియా స్కీమ్‌ రెండో విడత కింద ప్రకటించిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 266, తెలంగాణలో 138 చార్జింగ్‌ స్టేషన్లు రానున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 317 చార్జింగ్‌ స్టేషన్లు మంజూరయ్యాయి. స్థల సేకరణ, అవగాహన పత్రాలు కుదుర్చుకోవడం తదితర అంశాలు పూర్తయ్యాక.. స్టేషన్లు ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతి పత్రాలు లభిస్తాయి. దాదాపు 7,000 పైచిలుకు చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. వీటిలో 2,636 స్టేషన్లకు అనుమతి లభించింది. ఇందులో 1,633 ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు .. 1,003 స్లో చార్జింగ్‌ స్టేషన్లు ఉండనున్నాయి.   

మరిన్ని వార్తలు