హెచ్‌ఎంటీకి రూ. 77 కోట్ల ఆర్థిక ప్యాకేజీ

21 Feb, 2014 01:15 IST|Sakshi
హెచ్‌ఎంటీకి రూ. 77 కోట్ల ఆర్థిక ప్యాకేజీ

 కేంద్ర కేబినెట్ ఆమోదం...
 వేతనాలు, పీఎఫ్ ఇతరత్రా బకాయిల చెల్లింపు కోసమే
 
 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హెచ్‌ఎంటీ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్‌కు రూ.77.4 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు ఆమో దం లభించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన వేతనాలు, పీఎఫ్, గ్రాట్యుటీ ఇతరత్రా బకాయిల చెల్లింపు కోసం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నారు. హెచ్‌ఎంటీకి 2013 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బకాయిల కోసం రూ.27.06 కోట్లను, హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్‌కు 2012 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి కాలానికి బకాయిలకు గాను రూ.55.34 కోట్లను బడ్జెట్‌లో ప్రణాళికేతర కేటాయింపుగా ఇచ్చేందుకు సీసీఈఏ లైన్‌క్లియర్ చేసింది. ఈ రెండు కంపెనీల పునరుద్ధరణ, పునర్‌వ్యవస్థీకరణ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగుల్లో స్థైర్యాన్ని నింపేలా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. హిందుస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌గా 1953లో ఏర్పాటైన ఈ కంపెనీ పేరు 1973లో హెచ్‌ఎంటీ లిమిటెడ్‌గా మారింది. గతేడాది అక్టోబర్ 31 నాటికి సంస్థలో 1439 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్యాకేజీ నేపథ్యంలో గురువారం హెచ్‌ఎంటీ షేరు 5% లాభపడి రూ.31.15 వద్ద ముగిసింది.
 
 గ్లాక్సో రూ.6,400 కోట్ల ఎఫ్‌డీఐకి ఓకే...
 
 గ్లాక్సో స్మిత్‌క్లైన్ భారత్‌లో రూ.6,400 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదముద్ర వేసింది. భారత్‌లోని అనుబంధ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాలో 24.33 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయడం కోసం మాతృ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఓపెన్ ఆఫర్ ప్రకటించడం తెలిసిందే. ఇందుకోసం రూ.6,400 కోట్లను వెచ్చించనుంది. ఈ కొనుగోలు పూర్తయితే జీఎస్‌కే ఫార్మాలో జీఎస్‌కే గ్రూప్ వాటా ఇప్పుడున్న 50.67% నుంచి 75 శాతానికి చేరనుంది.
 
 హిటాచీ.. ప్రిజమ్ పేమెంట్ కొనుగోలుకూ
 
 ప్రిజమ్ పేమెంట్ సర్వీసెస్‌ను కొనుగోలు చేసేందుకు జపాన్ కంపెనీ హిటాచీ ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. ఈ డీల్ విలువ రూ.1,540 కోట్లు. ప్రిజమ్ పేమెంట్‌లో 100 శాతం వాటాను హిటాచీ కన్సల్టింగ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇండియా, హిటాచీ లిమిటెడ్‌లు దక్కించుకోనున్నాయి.ప్రిజమ్ పేమెంట్ నిర్వహణలో ప్రస్తుతం 10వేలకు పైగా ఏటీఎంలు, 52,500 పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్‌లు ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా