వ్యాపార నిర్వహణ మరింత సులభతరం

22 Jun, 2016 00:58 IST|Sakshi
వ్యాపార నిర్వహణ మరింత సులభతరం

సమస్యల జాబితా తయారు చేయాలని
సీఏఐటీకి వాణిజ్యశాఖ వినతి

న్యూఢిల్లీ: దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేయడంపై వాణిజ్య మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి వీలుగా... సమస్యల జాబితాను రూపొందించాలని అఖిల భారత ట్రేడర్ల  సమాఖ్య (సీఏఐటీ)కి విజ్ఞప్తి చేసింది. పన్నులు, బ్యాంకింగ్ అంశాలుసహా వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలనూ కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరింది. పారిశ్రామిక విధానం అభివృద్ధి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్  మంగళవారం సీఏఐటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యల జాబితాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఇందుకు సంబంధించి అవసరమైతే ఇతర శాఖలు, రాష్ర్ట ప్రభుత్వాలతో కూడా వాణిజ్యమంత్రిత్వశాఖ సంప్రతింపులు జరుపుతుందని తెలిపారు. ఈ-కామర్స్ రంగానికి సంబంధించి డీఐపీపీ జారీ చేసిన మార్గదర్శకాల విషయంలో ఏదైనా వివరణలు అవసరమయితే ట్రేడర్లు డెరైక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను సంప్రతించవచ్చని సూచించారు.

సమావేశంలో నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో చిన్న వ్యాపారవేత్తల పాత్ర కీలకమని వివరించారు. దేశంలో ఈ-కామర్స్ రంగం భారీగా వృద్ధి చెందుతోందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం మార్కెట్ పరిమాణం 20 బిలియన్ డాలర్లుకాగా, 2023-24 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి ఈ పరిశ్రమ చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మాస్టర్‌కార్డ్ దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పురోస్ సింగ్ మాట్లాడుతూ, 2014 నుంచి దేశంలో రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు