ఎన్ని చేసినా ఫలితం లేదు!

12 Apr, 2019 12:13 IST|Sakshi

చిన్న పరిశ్రమలకు రుణాల్లో తగ్గిన ప్రభుత్వ బ్యాంకుల వాటా

2018 డిసెంబర్‌లో 39 శాతం

2013 ఇదే నెల్లో  మార్కెట్‌ వాటా 58 శాతం

పెరిగిన ప్రైవేటు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్సర్ల వాటా  

ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ)  ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తగిన రుణ సౌలభ్యం సకాలంలో అందాలని, రుణ పరిమాణం భారీగా పెరగాలని ప్రభుత్వ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నా, ఫలితం కనిపించడం లేదు. 2018 డిసెంబర్‌లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (మార్కెట్‌) వాటా 39% అయితే, 2013 ఇదే నెల్లో ఈ రేటు 58%గా ఉంది.   ప్రభుత్వ రంగ భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బీ), క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ట్రాన్సూనియన్‌ సిబిల్‌ల తాజా నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.

నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
ముద్ర, 59 సెకండ్‌ లోన్‌ స్కీమ్స్‌ వంటి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, చిన్న పరిశ్రమలకు రుణాల్లో తమ మార్కెట్‌ వాటాను ప్రభుత్వ బ్యాంకులు కోల్పోతున్నాయి.
దీనికి కారణాల్లో ఎన్‌పీఏల సమస్య ఒకటి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చిన్న పరిశ్రమలకు మార్కెట్‌ షేర్‌ తగ్గినా, ప్రైవేటు రంగ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి మాత్రం పెరిగింది. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే...  2013 డిసెంబర్‌లో చిన్న పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో వీటి వాటా 22 శాతం అయితే, 2018 డిసెంబర్‌లో ఈ రేటు 33 శాతానికి చేరింది. నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల విషయంలో ఈ రేటు 13 శాతం నుంచి 21 శాతానికి ఎగసింది.  
అయితే రుణ పంపిణీలను విలువల రూపంలో మాత్రం నివేదిక వెల్లడించలేదు.  
కాగా ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి తమ మార్కెట్‌ షేర్‌ను పెంచుకోగలుగుతాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది.  
చిన్నపరిశ్రమల ఎన్‌పీఏలు క్యూ4 కొంత తగ్గాయి.
ఇక చిన్న పరిశ్రమలకు మొత్తం రుణాలను చూస్తే, 2018 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో వృద్ధిరేటు 19.3 శాతంగా ఉంది.  
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవస్థలో రుణ లభ్యతపై ప్రత్యేకించి ఈ విషయంలో చిన్న తరహా పరిశ్రమల విషయంపై దృష్టి సారించారు.

ఎన్‌పీఏలపై జాగరూకత అవసరం
మొత్తంగా చూస్తే లఘు, చిన్న మధ్య తరహా పరి శ్రమలకు రుణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రత్యేకించి ఈ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రమవకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ దిశలో తమ పోర్టిఫోలియోలను లెండర్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. వ్యవస్థాపరమైన ఇబ్బందులు లేకుండా విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలి.  
– సతీష్‌ పిళ్లై, ఎండీ అండ్‌ సీఈఓ, ట్రాన్సూనియన్‌ సిబిల్‌

మరిన్ని వార్తలు