బ్యాంకింగ్‌ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి

28 May, 2018 09:05 IST|Sakshi

ఇండోర్‌ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్‌ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పీఎన్‌బీకి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్‌టీఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే వ్యక్తి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్ద ఈ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ బ్యాంకింగ్‌ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలది. వీరు పీఎన్‌బీ అధికారులతో కుమ్మకై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకింగ్‌ కుంభకోణాల వల్ల రూ.2390.75 కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్‌ఐటీ సమాధానంలో తెలిసింది. 

ఇదే కాలంలో బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.2,224.86 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్‌ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.1,084.50 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్టు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఎకనామిస్ట్‌ జయంతిలాల్‌ భండారి అన్నారు. దీని వల్ల ప్రస్తుతం బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా... భవిష్యత్తులో కొత్త రుణాలు అందివ్వడంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు