బంగారం దిగుమతులు బ్యాన్‌

26 Aug, 2017 11:07 IST|Sakshi
బంగారం దిగుమతులు బ్యాన్‌
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా నుంచి విపరీతంగా బంగారం, వెండి దిగుమతులు పెరుగుతుండటంతో, వీటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తులను నియంత్రిత కేటగిరీలోకి చేర్చింది. దీంతో బంగారం, వెండిని దిగుమతి చేసుకోవాలంటే దిగుమతిదారులు ముందస్తుగా ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు మధ్య కాలంలో దక్షిణ కొరియా నుంచి 1 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన బంగారం దిగుమతులు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాయిన్లు, ఆభరణాల రూపంలో అన్ని రకాల బంగారం, వెండి ఉత్పత్తులపై ఈ పరిమితి విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
 
బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ లేకుండా దక్షిణ కొరియాకు, భారత్‌కు మధ్య ఉచిత వాణిజ్య ట్రేడ్‌ జరుగుతోంది. ఉచిత వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్‌ డ్యూటీ ఉంది. చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా భారత్‌ ఉంది. ప్రస్తుతం 400 ప్లస్‌ ఉత్పత్తులు నియంత్రిత దిగుమతుల జాబితాలో ఉన్నాయి. వాటిలో జంతువులు, కొన్ని విత్తనాలు, యూరేనియం, పేలుడు పదార్థాలున్నాయి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిషేధం ఉందని, ఎఫ్‌టీఏ నిబంధనలను ఇది ఉల్లంఘించడం లేదని అధికారులు పేర్కొన్నారు. జూలైలో బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయి.  
మరిన్ని వార్తలు