జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంపై అత్యవసర భేటీ..

19 Mar, 2019 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యంతో మంగళవారం జరిపిన అత్యవసర భేటీలో డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు   జెట్‌ ఎయిర్‌వేస్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నగదు లభ్యత కొరవడటంతో సమస్యలు ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ చేతులెత్తేయడంతో వేతనాలపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మార్చి నాటికి వేతనాలను క్లియర్‌ చేస్తామని తమకిచ్చిన హామీ నెరవేరకపోవడంతో కం‍పెనీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొంది.

తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో దాదాపు 560 మంది మెయింటెనెన్స్‌ ఇంజనీర్లు పనిచేస్తుండగా 490 మంది ఇంజనీర్లు ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ తమకు కంపెనీ మూడు నెలల జీతాలు బకాయి ఉందని ఇంజనీర్ల అసోసియేషన్‌ డీజీసీఏకు పంపిన ఈ మెయిల్‌లో పేర్కొంది.


అత్యవసర భేటీ..
జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులకు నెలకొన్న అసౌకర్యం నేపథ్యంలో అత్యవసర భేటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో డీజీసీఏ సంస్థ యాజమాన్యంతో సమావేశమైంది. విమాన సర్వీసుల రద్దు, క్యాన్సిలేషన్‌, రిఫండ్ల వివరాలతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, బ్యాంకర్లకు బకాయిలు వంటి పలు అంశాలపై యాజమాన్యంతో ఈ భేటీలో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.


సంక్షోభం సమసేలా..
ప్రైవేట్‌ ఎయిర్‌లైనర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాళా బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులను కాపాడే క్రమంలో ప్రభుత్వం బ్యాంకర్లను చొరవ చూపాలని సూచించింది. బ్యాంకులకు కంపెనీ బకాయి పడిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని దివాళా గండం నుంచి గట్టెక్కించాలని బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కాగా,  జెట్ ఎయిర్‌వేస్‌ను తిరిగిగాడిలో పెట్టే ప్రణాళికలను సైతం ఆయా బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు