పీఎన్‌బీ కేసులో కేంద్రం కొరడా..

14 May, 2018 23:59 IST|Sakshi

అలహాబాద్‌ బ్యాంక్‌ సీఈవోపై వేటు దిశగా చర్యలు

ఇద్దరు పీఎన్‌బీ ఈడీలపై కూడా

ముందుగా అధికారాలకు కత్తెర

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థను కుదిపేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మోసం కేసులో కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అలహాబాద్‌ బ్యాంక్‌ సీఈవో ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు పీఎన్‌బీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లపై వేటు దిశగా ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్‌ శరణ్‌లకి ఉన్న ఆర్థికపరమైన, ఎగ్జిక్యూటివ్‌పరమైన అధికారాలకు పీఎన్‌బీ బోర్డు కత్తెర వేసింది.

ఇదే తరహాలో పీఎన్‌బీ మాజీ చీఫ్‌ కూడా అయిన ఉషా అనంత సుబ్రమణియన్‌ అధికారాలను కూడా తొలగించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్‌ బ్యాంకు బోర్డుకు ప్రభుత్వం సూచించినట్లు కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆయా బ్యాంకుల బోర్డుల నుంచి డైరెక్టర్ల తొలగింపునకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందని, ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు.

ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌ సూచనల ప్రకారం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించిన పీఎన్‌బీ బోర్డు.. ఇద్దరు ఈడీలకు ఉన్న అధికారాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉషా అనంతసుబ్రమణియన్‌ విషయంలో ఒకట్రెండు రోజుల్లో అలహాబాద్‌ బ్యాంకు బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ చర్యలు ప్రకటించడం గమనార్హం. అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత సీఈవో, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌.. 2015 నుంచి 2017 దాకా పీఎన్‌బీ చీఫ్‌గా వ్యవహరించారు.  

పది రోజుల క్రితం షోకాజ్‌ నోటీసులు..
పీఎన్‌బీ కుంభకోణం కేసుకు సంబంధించి ఇటీవలే ఉషను ప్రశ్నించిన సీబీఐ.. సదరు వివరాలను చార్జిషీటులో పొందుపర్చింది. కేంద్ర ఆర్థిక శాఖ వీరందరికీ పది రోజుల క్రితం షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసినట్లు రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. 2016లో ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీలకు ఉపయోగించే స్విఫ్ట్, కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలను అనుసంధానం చేయాల్సి ఉందని, అది జరగకపోవడం వల్లే ప్రస్తుత కుంభకోణం చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు.

నకిలీ లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ల ద్వారా ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ సంస్థలు .. ఈ కుంభకోణానికి పాల్పడ్డాయి. ‘వ్యవస్థకు రిస్కును తగ్గించేలా చూడటం సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత. ఇప్పటికే  ఆయా బ్యాంకుల టాప్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చాం. తొలగింపునకు సంబంధించి చర్యలు కూడా చేపట్టాం. కేవలం వదంతుల ఆధారంగా కాకుండా పక్కా ఆధారాలతోనే చర్యలు తీసుకుంటాం’ అని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.


సీబీఐ తొలి చార్జిషీటులో 22 మంది
నీరవ్‌ మోదీ, చోక్సీ సహా పలువురు బ్యాంక్‌ అధికారులు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణంలో సీబీఐ సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. స్కామ్‌ సూత్రధారి, ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు మొత్తం 22 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ముంబైలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ చీఫ్, అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్‌ పాత్ర గురించిన వివరాలను పొందుపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కేసు విషయంలో సీబీఐ ఇటీవలే ఆమెను ప్రశ్నించింది. మరోవైపు, పీఎన్‌బీ ఈడీలు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్‌ శరణ్, జనరల్‌ మేనేజర్‌ (ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌) నేహల్‌ అహద్, నీరవ్‌ మోదీ సోదరుడు నిషాల్‌ మోదీ పేర్లు చార్జిషీటులో ఉన్నాయి. అయితే, మోదీ భార్య అమీ, ఆయన మేనమామ..వ్యాపార భాగస్వామి మెహుల్‌ చోక్సీ పేర్లు మాత్రం లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌ కేసు దర్యాప్తునకు సంబంధించి దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్లలో ఆయన పాత్ర వివరాలు రావొచ్చని వివరించాయి. మోదీ సంస్థలైన డైమండ్స్‌ ఆర్‌ అజ్, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్‌ డైమండ్స్‌.. బ్యాంకు వర్గాలతో కుమ్మక్కై రూ. 6,498 కోట్ల విలువ చేసే లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌వోయూ)ను మోసపూరితంగా పొందాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది.   

తొలి ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. సప్లిమెంటరీ చార్జిషీట్లలో షెల్‌ కంపెనీలు, విదేశీ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకు శాఖల ఉద్యోగుల పాత్ర మొదలైన విషయాలు కూడా ఉంటాయి. క్రిమినల్‌ కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఈ చార్జిషీటులో ఉన్నాయి.

2011–17 మధ్య కాలంలో పీఎన్‌బీ అధికారులతో కుమ్మక్కై నీరవ్‌ మోదీ సంస్థలు .. మోసపూరితంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ) పొందాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుని వాడుకున్నాయి. ఇది బైటపడేటప్పటికే మోదీ, చోక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు.  

సీబీఐ చార్జిషీటులో అభియోగాలివీ..
పీఎన్‌బీ సిబ్బంది ఎలాంటి నగదు మార్జిన్లు, పరిమితులు లేకుండా మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా మోసబుద్ధితో ఎల్‌వోయూలు జారీ చేశారు. వాటి ఆధారంగా విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మోదీ సంస్థలు దారిమళ్లించాయి.
   ఇలాంటి మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్స్‌ను అప్పటి పీఎన్‌బీ ఎండీ ఉషాతో పాటు ఇతర సీనియర్‌ అధికారులు పట్టించుకోలేదు. స్విఫ్ట్, సీబీఎస్‌లను అనుసంధానం చేయాలంటూ ఆర్‌బీఐ పదే పదే సర్క్యులర్‌లు, నోటీసులు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. బ్యాంకులో అంతా సవ్యంగానే ఉందని నివేదికలిస్తూ ఆర్‌బీఐని తప్పుదోవ పట్టించారు.  
    బ్రాడీ హౌస్‌ బ్రాంచ్‌లోని గోకుల్‌నాథ్‌ శెట్టి ఏడేళ్లు డిప్యూటీ మేనేజర్‌ హోదాలోనే కొనసాగారు. ఎలాంటి జంకూ లేకుండా మోసపూరిత ఎల్‌వోయూల జారీ కొనసాగించారు.
 చార్జిషీటులో ఉష పేరు ఉన్నంత మాత్రాన ఆమెకు ముందు ఆ హోదాల్లో పనిచేసిన వారికి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు కాదు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా