ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు!

2 Jul, 2019 10:36 IST|Sakshi

ఎన్‌బీఎఫ్‌సీలపై నియంత్రణ లక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ : నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల పై మరింత పర్యవేక్షణ, మరిన్ని నియంత్రణ అధికారాలను ఆర్‌బీఐకి కట్టబెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ పరిస్థితిని ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని, ఈ రంగం పనితీరును, కార్యకలాపాల పర్యవేక్షణను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు మూలధన నిధులు సమకూర్చే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌కు ఈ వివరాలను ఆమె వెల్లడించారు. వివిధ అంశాలపై వివరణలను ఆమె పార్లమెంట్‌కు నివేదించారు.

మూత పడ్డ 6.8 లక్షలకు పైగా కంపెనీలు  
భారత్‌లో ఇప్పటివరకూ 6.8 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. ఆర్‌ఓసీ కింద మొత్తం 18.9 లక్షల కంపెనీలు నమోదయ్యాయని, దీంట్లో 36 శాతం మేర కంపెనీలు మూతపడ్డాయని ఆమె పార్లమెంట్‌కు వెల్లడించారు. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు వార్షిక నివేదికలను సమర్పించని కంపెనీలను గుర్తించి, రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని పేర్కొన్నారు.  

19 కోట్ల ‘ముద్ర’ రుణాలు ... 
ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎమ్‌ఎమ్‌వై) కింద ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఈ ఏడాది జూన్‌ 21 వరకూ 19 కోట్ల ముద్ర రుణాలు  మంజూరు చేశాయి. వీటిల్లో 2,313 ముద్ర ఖాతాలు మోసపూరితమైనవిగా గుర్తించామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. వీటిల్లో అత్యధికంగా తమిళనాడు(344)లో చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.  

నకిలీ ఐటీసీ క్లెయిమ్‌లు రూ.2,565 కోట్లు... 
రూ.2,565 కోట్ల ఇన్‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)క్లెయిమ్‌ చేస్తూ, దాఖలు చేసిన 535 నకిలీ ఇన్‌వాయిస్‌లను జీఎస్‌టీ అధికారులు గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్‌ పార్లెమెంట్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి 40 మందిని ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని పేర్కొన్నారు.  

పెరుగుతున్న కంపెనీ మోసాలు... 
కంపెనీల మోసాలు పెరిగిపోతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ మోసాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  594 కంపెనీలకు పాత్ర ఉన్న 79 కేసులను గత మూడేళ్లలో  సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు చేసిందని ఆమె పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ కాలంలోనే రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌ఓసీ) 256 కేసులను దర్యాప్తు చేసిందని తెలిపారు. వైట్‌ కాలర్‌ నేరాల నియంత్రణ నిమిత్తం సెబీ, కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు డేటా బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని తెలిపారు.  

రూ.14,578 కోట్లకు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు.... 
బ్యాంకింగ్‌ రంగంలో అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు గత  ఏడాది 27 శాతం ఎగసి రూ.14,578 కోట్లకు పెరిగాయని పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ నివేదించారు. 2016లో రూ.8,928 కోట్లుగా ఉన్న అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు 2017లో రూ.11,494 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఏడాది చివరినాటికి ఒక్క ఎస్‌బీఐలోనే రూ.2,516 కోట్ల అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా జీవిత బీమా రంగంలో రూ.16,888 కోట్లు, సాధారణ బీమారంగంలో రూ.990 కోట్ల అన్‌క్లెయిమ్‌డ్‌ మొత్తాలున్నాయని తెలిపారు.
 
23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్న ఓఎన్‌జీసీ... 
ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ కంపెనీ గత మూడేళ్లలో 23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఓఎన్‌జీసి వద్ద 459.84 మిలయిన్‌ టన్నుల చమురు నిక్షేపాలున్నాయని పెట్రోలియమ్‌  శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభకు రాతపూర్వకంగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ 21.11 మిలిన్‌ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని, గత మూడేళ్లలో మొత్తం 65.66 మిలియన్‌ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని పేర్కొంది. ఇంధన దిగుమతులను తగ్గించుకునే ప్రణాళిక కోసం ఓఎన్‌జీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. 2017–18లో రూ.5.66 లక్షల కోట్లుగా ఉన్న ముడిచమురు దిగుమతుల బిల్లు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.83 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2013–14లో ముడి చమురు దిగుమతుల బిల్లు అత్యధికంగా రూ.8.64 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు