రూపీ కోసం వాటిపై సుంకాలు పెంపు

19 Sep, 2018 13:01 IST|Sakshi
రూపాయిని కాపాడేందుకు చర్యలు (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ : రోజు రోజుకు అంతకంతకు క్షీణిస్తున్న రూపాయిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. కొన్ని స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం పెంచాలని స్టీల్‌ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ రేట్లు 5 శాతం నుంచి 12.5 శాతం మధ్యలో ఉన్నాయి. దీంతో రూపాయికి కాస్త మద్దతు ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనతో అవసరం లేని దిగుమతులను తగ్గించి, డాలర్లు తరలి వెళ్లడాన్ని ఆపివేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖతో నేడు చర్చోపచర్చలు జరుపనున్నారు. దేశీయ స్టీల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించి, మేకిన్‌ ఇండియాకు ఊతమిచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించేందుకు స్టీల్‌, ట్రేడ్‌ మంత్రిత్వ శాఖలు అంగీకరించలేదు. 

జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో, నికర స్టీల్‌ దిగుమతులు రెండేళ్లలో తొలిసారి 2.1 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 15 శాతం పెంపు. మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌ దిగుమతులు 8.4 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. వీటిలో 45 శాతం జపాన్‌, దక్షిణ కొరియా నుంచి వచ్చినవే. ఆయా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయి. నార్త్‌ ఆసియన్‌ దేశాల నుంచి స్టీల్‌ను దిగుమతి చేసుకుంటే, ఎలాంటి సుంకాలు వర్తించవు. కానీ ఇతర స్టీల్‌ సరఫరా దేశాలు చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, రష్యా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మాత్రం సుంకాలను భరించాల్సి ఉంటుంది. స్టీల్‌తో పాటు ప్రభుత్వం బంగారం, హై-ఎండ్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆంక్షలు విధించేందుకు చూస్తోంది. భారత్‌, ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. ఆగస్టులో దీని దిగుమతులు 90 శాతం పెరిగి, 3.64 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
 

మరిన్ని వార్తలు