బంకు ఓపెన్‌!

24 Oct, 2019 04:32 IST|Sakshi

పెట్రోల్‌ బంకుల నిబంధనలు సరళతరం

చమురుయేతర సంస్థలూ ఏర్పాటు చేయొచ్చు

ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశాలు

ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు

కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్‌ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తలుపులు  తెరిచినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ (సీసీఈఏ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది.

ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని రిటైల్‌ అవుట్‌లెట్స్‌ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి‘ అని సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఇంధన మార్కెటింగ్‌ నిబంధనలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో అమల్లోకి వచ్చినవి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత మార్పులతో పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది.

పెట్రోల్‌ బంకులపై సీసీఈఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రధానాంశాలు..
► పెట్రోల్‌ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, బయోఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్‌లెట్‌ లేదా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

► రూ. 250 కోట్ల నికర విలువ గల కంపెనీలు .. పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌కి అనుమతులు పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంధన రిటైలింగ్‌ లైసెన్సు పొందాలంటే హైడ్రోకార్బన్స్‌ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్‌ లేదా ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్స్‌ వంటి వాటిపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటోంది. ఇంధనాల మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న కంపెనీలకు.. ఈ నిబంధన ప్రతిబంధకంగా ఉంటోంది.

► ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా మొత్తం అవుట్‌లెట్స్‌లో 5% అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. లేదంటే  ఒక్కో బంకుకు రూ. 3 కోట్ల మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది.
 
దిగ్గజాల ఎంట్రీకి మార్గం..
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎస్‌ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో, బ్రిటన్‌ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్‌ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్‌ .. 2018 నవంబర్‌లోనే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్‌ విక్రయాల అవుట్‌లెట్స్‌ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్‌ బంకుల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది.  ప్యూమా ఎనర్జీ రిటైల్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్‌కో ఇంకా చర్చల్లో ఉంది.

ప్రభుత్వ సంస్థల హవా...  
కంపెనీ    బంకుల సంఖ్య
ఐఓసీ    27,981
హెచ్‌పీసీఎల్‌    15,584
బీపీసీఎల్‌    15,078
రిలయన్స్‌    1,400
నయారా    5,344
(గతంలో ఎస్సార్‌ ఆయిల్‌)
షెల్‌    160  

మరిన్ని వార్తలు