ఎయిర్‌ ఇండియా ఆస్తుల అమ్మకం

4 Dec, 2018 01:01 IST|Sakshi

 రూ.9,000 కోట్లు రావచ్చని  కేంద్రం అంచనా

రుణ భారం తగ్గించేందుకు  వరుస నిర్ణయాలు

ఎయిర్‌ ఇండియాకు  రూ.55,000 కోట్ల రుణాలు

గాడిలో పెట్టి, విక్రయించాలన్నది కేంద్రం వ్యూహం

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా రుణ భారం తగ్గించేందుకు కేంద్రం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన భూమి, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విక్రయం ద్వారా రూ.9,000 కోట్లను సమీకరించాలన్నది తాజా ప్రతిపాదన. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000 కోట్ల మేర రుణ భారం ఉండగా, దీన్ని తగ్గించే ప్రణాళికలో భాగంగా ఆస్తులను విక్రయించాలనుకుంటోంది. దీనివల్ల రుణ భారం తగ్గడంతోపాటు సంస్థ విలువ పెరిగి ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించడం వీలవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఎయిర్‌ ఇండియా రుణాల్లో రూ.29,000 కోట్లను ఎయిర్‌ ఇండియా అస్సెట్‌ హోల్డింగ్‌ కంపెనీ పేరుతో ఓ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు (ఎస్‌పీవీ) బదిలీ చేయాలని గత వారమే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ప్యానెల్‌ నిర్ణయించింది. ఇక ఎయిర్‌ ఇండియా ఆస్తుల విక్రయంతో వచ్చిన నిధులను ఎస్‌పీవీకి బదిలీ చేసిన రుణాలను తీర్చివేసేందుకు వినియోగిస్తారు. ‘‘ఎయిర్‌ ఇండియా ఆస్తుల విక్రయంతో రూ.9,000 కోట్లను సమీకరించాలనుకుంటున్నాం. ముంబైలోని ఎయిర్‌లైన్స్‌ హౌస్, ఢిల్లీలోని వసంత్‌ విహార్, బాబా ఖరక్‌ సింగ్‌ మార్గ్‌లో ఉన్న రియల్టీ ఆస్తుల విక్రయం ఈ ప్రణాళికలో ఉన్నాయి’’ అని ఓ అధికారి తెలిపారు.  

ఎయిర్‌ ఇండియా ఏటీఎస్‌ఎల్‌ అమ్మకం 
ఎయిర్‌ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐ శాట్స్‌) విక్రయానికి మంత్రివర్గ ప్యానెల్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విభాగం 2016–17లో రూ.61 కోట్ల లాభాన్ని ఆర్జించింది. దీని అమ్మకంతో వచ్చే నిధుల్ని రుణ భారం తగ్గించేందుకే వినియోగించనుంది. ‘‘ఎయిరిండియా రుణ భారం తగ్గించేందుకు అడుగు తర్వాత అడుగు వేస్తున్నాం. మరోసారి ఎయిర్‌ ఇండియాను వ్యూహాత్మక విక్రయానికి ఉంచితే, ఇన్వెస్టర్లు ముందుకు వచ్చేలా ఉండాలి. ఈ చర్యలన్నీ ఎయిర్‌ ఇండియా విక్రయంలో భాగమే’’ అని సదరు అధికారి తెలిపారు. ఎయిర్‌ ఇండియా గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా పలు ఆస్తుల విక్రయానికి బిడ్లను ఆహ్వానించింది. ముంబైలో 28 ఫ్లాట్లు, అహ్మదాబాద్‌లో 7 ఫ్లాట్లు, పుణెలో రెండు ఫ్లాట్లు, ఒక కార్యాలయ వసతి తదితర ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం ఈక్విటీని, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్నది కేంద్రం ఆలోచన. 

మరిన్ని వార్తలు