బిట్‌కాయిన్‌కు పగ్గాలు! 

21 Dec, 2017 00:03 IST|Sakshi

నియంత్రణపై ప్రభుత్వం దృష్టి

సెబీ, ఆర్‌బీఐలతో సంప్రతింపులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడి 

ముంబై: భారీగా విస్తరిస్తున్న బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టోకరెన్సీలను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో సంప్రతింపులు జరుపుతోంది. క్రిప్టోకరెన్సీలపై చట్టపరమైన పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఈ విషయాలు తెలిపారు. ‘ఆర్‌బీఐ, సెబీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ బిట్‌కాయిన్ల అంశాన్ని పరిశీలిస్తోంది. కమిటీలో ఆర్థిక, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల అధికారులు కూడా ఉన్నారు. దేనికైనా ఒక ప్రక్రియ లేదా చట్టం ఉండాలి. అప్పుడే చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. వర్చువల్‌ కరెన్సీ వల్ల ఇప్పటిదాకా వ్యవస్థాగతమైన సమస్యలేమీ రాలేదని, అలాగని దీన్ని పట్టించుకోకుండా ఉండలేమని త్యాగి పేర్కొన్నారు.  

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ప్రోత్సహించాలి.. 
బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ లాంటి సాంకేతికతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీన్ని నియంత్రణ సంస్థలు అలక్ష్యం చేయరాదని ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగానే బిట్‌కాయిన్లు తదితర క్రిప్టోకరెన్సీల లావాదేవీలు జరుగుతుంటాయి. మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరవేయడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడే రిస్కులున్న బిట్‌కాయిన్ల వంటి క్రిప్టోకరెన్సీలను ఆర్‌బీఐ సహా ఇతరత్రా ఏ నియంత్రణ సంస్థా ఆమోదించలేదు. అయితే, బిట్‌కాయిన్‌ విలువ ఏకంగా రూ. 10 లక్షలకి చేరిన నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలు గడించారంటూ వస్తున్న వార్తలు నియంత్రణ సంస్థలను కలవరపరుస్తున్నాయి.

‘క్రిప్టో’ కుబేరుడు అమితాబ్‌ బచ్చన్‌.. 
బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల్లోనూ స్టార్‌గా నిల్చారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఆయన గతంలో ఒక కంపెనీలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ ప్రస్తుతం అనేక రెట్ల రాబడులు అందించడమే ఇందుకు నిదర్శనం. 2015లో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ సింగపూర్‌ సంస్థ మెరీడియన్‌ టెక్‌లో భాగమైన జిద్దుడాట్‌కామ్‌లో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. అప్పట్లో ఇది క్లౌడ్‌ స్టోరేజి, ఈ–డిస్ట్రిబ్యూషన్‌ స్టార్టప్‌ సంస్థగా కార్యకలాపాలు సాగించేది. ప్రస్తుతం ఇది బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత సర్వీసులను, క్రిప్టోకరెన్సీలో సూక్ష్మరుణాలు అందించే సంస్థగా రూపాంతరం చెందింది. దీన్ని ఇటీవలే లాంగ్‌ఫిన్‌ సంస్థ కొనుగోలు చేసింది. జిద్దులో పెట్టుబడులకు ప్రతిగా బచ్చన్‌లకు లాంగ్‌ఫిన్‌లో 2,50,000 షేర్లు లభించాయి. నాస్‌డాక్‌లో లిస్టయిన లాంగ్‌ఫిన్‌ కంపెనీ షేర్లు భారీ పెరగడంతో బచ్చన్‌ల పెట్టుబడుల విలువ 2,50,000 డాలర్ల నుంచి 1.75 కోట్ల డాలర్లకు ఎగబాకింది. 

మరిన్ని వార్తలు