ఈ కామర్స్‌ దిగ్గజాల ప్రాబల్యానికి చెల్లు!

6 Jul, 2020 11:39 IST|Sakshi

స్ధానిక స్టార్టప్‌లకు ప్రోత్సాహం

సాక్షి, న్యూఢిల్లీ : స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్‌ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్‌ ముసాయిదాకు ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. నూతన నిబంధనల ప్రకారం ఈ కామర్స్‌ కంపెనీలు 72 గంటల్లోగా ప్రభుత్వం కోరిన డేటాను అందుబాటులోకి తీసుకురావాలి. జాతీయ భద్రత, పన్నులు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై సత్వరమే ఆయా సంస్థలు సమాచారం అందించాల్సి ఉంటుంది.

సమాచార వనరులు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ పరిశ్రమలో పోటీయుత వాతావరణం నెలకొనేలా ఈ కామర్స్‌ రెగ్యులేటర్‌ను నియమిం‍చనున్నట్టు 15 పేజీలతో కూడిన ఈ ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. విధాన ముసాయిదాను వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించింది. ముసాయిదాలో పొందుపరిచిన ప్రతిపాదిత నియమాలు ఆన్‌లైన్ కంపెనీల సోర్స్ కోడ్‌లు మరియు అల్గారిథమ్‌లను ప్రభుత్వం పర్యవేక్షించే వెసులుబాటును కల్పిస్తుంది. ఈ-కామర్స్ వ్యాపారాలకు వివరించదగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉన్నదో..లేదో తెలుసుకునే అవకాశాన్నీ ముసాయిదా ప్రస్తావించనుంది.

50 కోట్ల యూజర్లతో దేశ డిజిటల్‌ ఎకానమీ ఎదుగుతున్న క్రమంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ నుంచి కంటెంట్‌ స్ట్రీమింగ్‌, డిజిటల్‌ చెల్లింపుల వరకూ ప్రతి రంగంలో గ్లోబల్‌ దిగ్గజాల ప్రాబల్యం పెరిగిపోగా స్ధానిక స్టార్టప్‌లు ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థిస్తున్నాయి.ప్రభుత్వం ఇటీవల చైనా యాప్‌లను నిషేధించిన క్రమంలో దేశీ కంపెనీలు ఈ రంగంలో ఎదిగేందుకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని కోరుతున్నాయి. విదేశీ సాంకేతిక దిగ్గజాలను నియంత్రించేలా రూపొందిన ఈ కామర్స్‌ విధాన ముసాయిదాను త్వరలో ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. డిజిటల్‌ గుత్తాధిపత్యానికి చెక్‌ పెడుతూ భారత వినియోగదారునికి, స్ధానిక ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చేలా ముసాయిదా విధానం రూపొందింది. చదవండి : అమెజాన్‌లో వారికి భారీ ఊరట

మరిన్ని వార్తలు