నిత్యావసర ధరలపై పోరు

6 Aug, 2016 02:13 IST|Sakshi
నిత్యావసర ధరలపై పోరు

2021 వరకూ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%

 న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో 4 శాతం ద్రవ్యోల్బణాన్ని లక్ష్యాన్ని స్థిరీకరించింది. మార్జిన్ ‘ప్లస్ లేదా మైనస్ 2’గా నిర్దేశించుకుంది. అంటే పెరిగితే గరిష్ఠ పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ఠ పరిమితి 2 శాతంగా ఉండాలన్న మాట. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే.

ప్రభుత్వ తాజా చర్యతో ఆర్‌బీఐ గవర్నర్ రూపొందించిన ‘ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ద్రవ్యోల్బణం నమూనా’కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది. ఆగస్టు 9న రాజన్ ద్రవ్యపరపతి సమీక్ష నేపథ్యంలో ఆర్థికశాఖ తాజా అడుగు వేసింది. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతానికి దిగివచ్చింది.

 ద్రవ్యోల్బణం పైపైకే..!
జూన్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 22 నెలల గరిష్ట స్థాయిలో 5.77 శాతంగా ఉంది.  ప్రభుత్వం- ఆర్‌బీఐ మధ్య ఫిబ్రవరిలో కుదిరిన అవగాహన ప్రకారం, ద్రవ్యోల్బణం కట్టుతప్పితే అందుకు కారణాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తుంది.

జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి జైట్లీతో శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. వచ్చే ఐదేళ్లు 4% ద్రవ్యోల్బణం లక్ష్య నిర్ణయం, ఆగస్టు 9 ద్రవ్య సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చలు జరిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు