డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు

1 Feb, 2019 05:23 IST|Sakshi

స్వతంత్ర సంస్థను నియమించిన కంపెనీ

న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  

అవసరమైతే తనిఖీలు చేస్తాం...
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ వీటిల్లో 31,000 కోట్ల మేర నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ఆన్‌లైన్‌న్యూస్‌ పోర్టల్, కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రి శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల రిజిష్ట్రార్‌(ముంబై)...డొల్ల కంపెనీలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలను గుర్తించడానికి ప్రయత్నించింది. రికార్డుల్లో ఉన్న చిరునామాల్లో సదరు కంపెనీలు లేవని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. అవసరమైతే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి సమాచారం కోరతామని పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పట్టి తనిఖీలు కూడా చేపడతామని వివరించారు. కాగా కంపెనీ వ్యవహారాల శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది.  

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌.. నాలుగేళ్ల కనిష్టానికి
ఈ వార్తల కారణంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 16% పతనమై రూ.136 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20 % నష్టపోయి నాలుగేళ్ల కనిష్ట స్థాయి, రూ.130ను తాకింది.  ఈ షేర్‌ వరుసగా 4 రోజూ నష్టపోయింది. ఈ షేర్‌  గత నాలుగు రోజుల్లో 35 శాతం, గత ఐదు నెలల్లో 80 శాతం చొప్పున  పతనమైంది.

మరిన్ని వార్తలు